యూపీఏలోకి ఆర్‌ఎల్‌ఎస్పీ

21 Dec, 2018 04:44 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కుష్వాహ

న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర మంత్రి పదవిని వదులుకుని ఎన్డీయే నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర కుష్వాహ గురువారం యూపీఏతో చేతులు కలిపారు. బిహార్‌లో తమ రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) ప్రతిపక్షాల మహాకూటమిలో చేరిందని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్, ఏఐసీసీ బిహార్‌ ఇన్‌ చార్జ్‌ శక్తిసింహ్‌ గోహిల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రతిపక్ష నేతలు శరద్‌ యాదవ్, జతిన్‌ రాం మాంఝీ తదితరుల సమక్షంలో కుష్వాహ ఈ ప్రకటన చేశారు. కుష్వాహను మహాకూటమిలోకి ఆహ్వానించిన పై నేతలు.. తామంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే తాను ఎన్డీయే నుంచి బయటకొచ్చాననీ, అలాగే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తమ పార్టీని అవమానిస్తున్నా మోదీ మౌనం వహించడం తనను బాధించిందని కుష్వాహ చెప్పారు.

ప్రమాదంలో బీజేపీ–ఎల్జేపీ బంధం!
బిహార్‌లో ఇప్పటికే ఆర్‌ఎల్‌ఎస్పీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయగా తాజాగా లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు