నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి రాహుల్‌!

13 Jul, 2019 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ : యువతలో స్ఫూర్తి నింపుతున్న రాహుల్‌ గాంధీ నుంచి తానెంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన బావ, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా అన్నారు. దేశ సేవలో ఎల్లప్పుడూ తన వెంటే ఉంటానని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.  ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రా తన సోషల్‌ మీడియాలో రాహుల్‌కు భావోద్వేగ లేఖను పోస్ట్‌ చేశారు.

ఈ మేరకు.. ‘ భారత జనాభాలో 65 శాతం ఉన్న యువత, వర్ధమాన, యువ నాయకులు నీ వైపే చూస్తున్నారు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది రాహుల్‌. దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నీవు తీసుకున్న నిర్ణయాలు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాయి. నా దృష్టిలో పదవి కంటే దేశ సేవకు పునరంకితం కావడమే గొప్ప విషయం. ఈ విషయంలో ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఉంటా. ప్రజలతో మమేకమవుదాం. అత్యుత్తమ మార్గంలో జాతికి సేవ చేద్దాం’  అని రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

కాగా పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానన్న రాహుల్‌.. ఈ మేరకు ట్విటర్‌లో నాలుగు పేజీల లేఖను పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే పార్టీ గెలుపొందడంతో రాహుల్‌తో పాటు పలువురు పీసీసీ చీఫ్‌లు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దే క్రమంలో రాహుల్‌ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లేదా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే ప్రచారం జోరందుకుంది.

మరిన్ని వార్తలు