మంటలు రేపిన మాటలు..

30 Dec, 2019 05:31 IST|Sakshi

రౌండప్‌- 2019

రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే...

మేకిన్‌ ఇండియా కాదు రేపిన్‌ ఇండియా
– రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌

ముస్లింలీగ్‌ గ్రీన్‌ వైరస్‌
– యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

గాడ్సే దేశభక్తుడు
– ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ

జయప్రద లోదుస్తులు ఖాకీ
– ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు
 
తీరైన తీర్పులు
దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్‌ డీల్‌ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!.

మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా...

జన్మభూమి... రాముడిదే!
దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్‌ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.

శబరిమలకు మహిళలు...
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ నారిమన్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్‌ 14న ఈ తీర్పుని వెలువరించింది.

న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్‌’...
ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్‌ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్‌ చేయటం... ఆమె తండ్రి లాకప్‌ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్‌ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్‌ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్‌ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

రాఫెల్‌... విచారణకు నో!
రాఫెల్‌ ఫైటర్‌ జెట్‌లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సింగ్, అరుణ్‌ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు