అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ

19 Jun, 2018 13:31 IST|Sakshi
చిన్నమల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న షబ్బీర్‌అలీ 

డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తాం

శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ

కామారెడ్డి రూరల్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సోమవారం చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం చిన్నమల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని, ప్రత్యక్ష దాడులతోపాటు భూ కబ్జాలు, ఇసుక దందాలు, కాంట్రాక్టులతో లక్షల రూపాయలు అర్జిస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌.. ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండానే అతను మాత్రం నాలుగు అంతస్తుల భవనాన్ని కట్టుకోవడంతో పాటు రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకులకే సబ్సిడీ ట్రాక్టర్లు, కార్పొరేషన్‌ రుణాలు, ఇసుక తవ్వకాలు, మిషన్‌ కాకతీయ తదితర పథకాల కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నిజాంను మించి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు 9 రకాల సరుకులను అందజేశామని, ప్రస్తుతం బియ్యం మాత్ర మే ఇస్తున్నారని, అవి కూడా త్వరలో రద్దు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ చెప్పినప్పటికీ వడ్డీ భారం అలాగే ఉంచారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇంది రమ్మ పథకం కింద ఎవరి స్థలాల్లో వారికే ఇళ్లు కట్టిస్తామన్నారు.

సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు ని మ్మ మోహన్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, నయీం, కైలాస్‌ శ్రీనివాస్‌రావు, రాములు, బాల్‌రాజు, భూపాల్‌రెడ్డి, వెం కటి, పండ్ల రాజు, ఆనంద్‌రావు, కిషన్, నరేశ్, భూలక్ష్మి, ఎల్లంరెడ్డి, భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు