ఆరెస్సెస్‌ ‘గ్రాండ్‌ ఇఫ్తార్‌’ ఆపండి

4 Jun, 2018 11:48 IST|Sakshi
ఇఫ్తార్‌ విందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి (ఫైల్‌ ఫోటో)

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ముస్లింలకు ఇవ్వనున్న ‘గ్రాండ్‌ ఇఫ్తార్‌’ విందుకు మరో దెబ్బ తగిలింది. ఆరెస్సెస్‌ నాయకులే ఈ విందును అడ్డుకునే యత్నం చేస్తున్నారు. మలబార్‌హిల్స్‌లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆరెస్సెస్‌ ‘గ్రాండ్‌ ఇఫ్తార్‌’ విందు ఏర్పాటు చేయనున్నసంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్‌ విందు నిర్వహించొద్దని ఆరెస్సెస్‌ ముస్లిం విభాగం (ముస్లిం రాష్ట్రీయ మంచ్‌) కార్యకర్తలు అదిల్‌ ఖత్రీ, షకీల్‌ అహ్మద్‌ షేక్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

2015 జూలై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్‌ మీటింగ్‌లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ ఉత్తర్వులపై స్పందించాలనీ, ఆరెస్సెస్‌ ఇఫ్తార్‌ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ కార్యక​ర్తలు కోరారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లింలకు దగ్గరవుదామని ఆరెస్సెస్‌ భావిస్తోందనీ, ముస్లిం వ్యతిరేక చర్యలు ఆపనంత వరకు ఎలాంటి విందుల్లో పాల్గొనబోమని వివిధ ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం నాటి గ్రాండ్‌ ఇఫ్తార్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కాగా, ఆరెస్సెస్‌ ఇవ్వనున్న ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు