అమిత్‌ షా కొడుకు 'అవినీతి'.. ఆరెస్సెస్‌ వైఖరి ఇదే!

12 Oct, 2017 12:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ షాపై అవినీతి ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జయ్‌ షా ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోయాయంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంపై తాజాగా ఆరెస్సెస్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు ఎవరిపైన వచ్చినా సరే, దర్యాప్తు చేయాల్సిందేనని, అయితే, ఈ ఆరోపణలకు తగినంతగా ప్రాథమిక ఆధారాలు ఉండాలని ఆరెస్సెస్‌ పేర్కొంది.

భోపాల్‌లో జరుగుతున్న ఆరెస్సెస్‌ సదస్సులో పాల్గొన్న సంస్థ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసబాలే గురువారం మీడియాతో మాట్లాడారు. 'ఎవరిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు జరిపి తీరాల్సిందే. అయితే, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి' అని ఆయన అన్నారు. జూనియర్‌ షాపై కేసు నమోదుచేసే అవకాశముందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. 'అది ఆరోపణలు చేసినవారిపై ఆధారపడి ఉంటుంది. ఆరోపణలను రుజువు చేసే బాధ్యత వారిదే' అని ఆయన పేర్కొన్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్‌ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్‌ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌  ఓ కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆ వెబ్‌సైట్‌ ఈ కథనాన్ని ప్రచురించిందని మండిపడింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశంపై దర్యాప్తు జరిపి.. నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశాయి. తన తండ్రి పరువు-ప్రతిష్టలను దెబ్బతీసేలా కథనం ప్రచురించిన వెబ్‌సైట్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని జయ్‌ షా గతంలో తెలిపారు.

మరిన్ని వార్తలు