ఆరెస్సెస్‌ వేదికపై రాహుల్‌!

28 Aug, 2018 02:36 IST|Sakshi

కార్యక్రమానికి ఆహ్వానించే యోచనలో సంఘ్‌

ఏచూరీనీ పిలిచే అవకాశం

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్‌ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్‌ భారత్‌: ఆరెస్సెస్‌ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆరెస్సెస్‌ ఒక  కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్‌ అభిప్రాయాలను ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు.

అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్‌ రాడికల్‌ గ్రూప్‌ అయిన ముస్లిం బ్రదర్‌ హుడ్‌తో ఆరెస్సెస్‌ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్‌ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్‌ భావిస్తోంది. ‘వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్‌ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్‌ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు’ అని సంఘ్‌ ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.

రాహుల్‌కు భారత్‌ గురించి తెలియదు
గతవారం లండన్‌ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌పై రాహుల్‌ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై అరుణ్‌ కుమార్‌ మండిపడ్డారు. ‘భారత్‌ గురించి అర్థం చేసుకోనన్ని రోజులు ఆరెస్సెస్‌ గురించి రాహుల్‌కు అర్థం కాదు. భారత్, భారత సంస్కృతి, వసుధైక కుటుంబకం అన్న గొప్ప ఆలోచన గురించి రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదు. ఇస్లామిక్‌ ఛాందసవాదం కారణంగా యావత్‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విషయం రాహుల్‌కు అర్థం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులేంటో ఆయనకు తెలియదు’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు