ఆరెస్సెస్‌ వల్లే అరాచకత్వం

26 Jan, 2019 05:06 IST|Sakshi
భువనేశ్వర్‌ విమానాశ్రయంలో జారిపడిన ఫొటోగ్రాఫర్‌ను పైకి లేపుతున్న రాహుల్‌

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ వ్యాఖ్య

భువనేశ్వర్‌: దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో చొచ్చుకునిపోయేందుకు, వాటిని నియంత్రించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నిస్తోందని  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌  ఆరోపించారు. అందువల్లే న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ సహా దేశంలో గందరగోళం, అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రజలను కలుసుకోవడంలో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ పలువురు మేధావులతో ముచ్చటించారు. ‘1991లో, 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేపట్టిన సరళీకరణ విధానాలతోనే దేశంలో మధ్యతరగతి అవతరించింది’ అని రాహుల్‌ తెలిపారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు నన్ను తరచుగా దూషిస్తూ ఉంటారు. వాటిని నేను బహుమానంగా స్వీకరిస్తా. ఎందుకంటే ఆ విమర్శలు నన్ను మరింత రాటుదేలేలా చేశాయి’ అని అన్నారు.

ప్రియాంక రాకపై గతంలోనే నిర్ణయం
సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్‌ స్పష్టంచేశారు. మిరాయా, రైహాన్‌ వాద్రాలు చిన్నపిల్లలు కావడంతో ప్రియాంక రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రస్తుతానికి యూపీలో కాంగ్రెస్‌ పార్టీని పునరుద్ధరించడమే ప్రియాంక లక్ష్యమనీ, ఎలాంటి ఇతర బాధ్యతలు ఆమెకు అప్పగించలేదని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందనీ, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్‌ల హత్యల తర్వాత అది మరింత దృఢపడిందని రాహుల్‌ పేర్కొన్నారు. తనను, ప్రియాంక పక్కపక్క గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే దాదాపు 80 శాతం ఒకేరకమైన సమాధానం వస్తుందని తెలిపారు.బీజేపీ నేత, సుల్తాన్‌పూర్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటి ఊహాగానాలు వస్తున్నట్లు తనకు తెలియదన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు