సంజయ్‌ దత్‌ గొప్పా.. ఎలా? : పాంచజన్య

12 Jul, 2018 16:14 IST|Sakshi
సంజయ్‌ దత్‌(పాత ఫొటో)

న్యూఢిల్లీ : సంజయ్‌ దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్‌ కాలమ్‌లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్‌ ‘ది మ్యాన్‌ హూ న్యూ ఇన్‌ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్‌ మాత్రం అండర్‌వరల్డ్‌కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది.

అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్‌ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది.
 
చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్‌ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు