టీఆర్‌ఎస్‌ ‘గెలుపు’ లెక్కలు

16 Oct, 2019 04:12 IST|Sakshi

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో విజయంపై అధికార పార్టీ ధీమా

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా అధికార టీఆర్‌ఎస్‌ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటోంది. సంస్థాగతంగా ఇతర పార్టీలతో పోలిస్తే బలంగా ఉన్నామని, కాంగ్రెస్‌ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు చేరడం కలసి వస్తుందని భావిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా బరిలో ఉండటం తమకే లాభిస్తుందని అంచనా వేస్తోంది.

ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తమ వ్యతిరేక ఓట్లను కమలం పార్టీ చీల్చుతుందని విశ్లేషిస్తోంది. అలాగే సీపీఎం బరిలో లేకపోవడం, సీపీఐ ఊగిసలాట ధోరణి తదితరాల ప్రభావం పెద్దగా ఉండదని కొట్టిపారేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయిన టీఆర్‌ఎస్‌ను ఈసారి ఉప ఎన్నికలో అలాంటివే మరో రెండు గుర్తులు ఉండటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి మూడు పర్యాయాలు గట్టి పోటీ ఇచ్చినా హుజూర్‌నగర్‌ సీటును కైవసం చేసుకోలేకపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌... ఈ నెల 17న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టింది.

రోజువారీ ప్రచారంపై ‘వార్‌ రూమ్‌’.. 
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచార వ్యూహం అమలు, సమన్వయం కోసం టీఆర్‌ఎస్‌ సుమారు 70 మంది ఇన్‌చార్జీలను నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు పలువురు పార్టీ నేతలకు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించింది. ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా పనిచేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ‘వార్‌ రూమ్‌’ను ఏర్పాటు చేసి రోజువారీ ప్రచార తీరుతెన్నులను సమన్వయం చేస్తోంది. ఇప్పటికే సామాజికవర్గాలవారీగా ప్రచార సభలు నిర్వహించింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటుండగా మరో మంత్రి పువ్వాడ అజయ్‌ అడపాదడపా పర్యటించి వెళ్లారు.

మరిన్ని వార్తలు