‘పంచాయతీ’ వద్దు! 

22 Apr, 2018 03:07 IST|Sakshi

స్థానిక ఎన్నికలంటే భయపడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటం అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. రాజకీయంగా కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తాయని వారు హడలిపోతున్నారు. పంచాయతీ ఎన్నికలు పెడితే పదవుల విషయంలో గ్రూపులు ఏర్పడతాయని అంటున్నారు. అవకాశం రాని ఆశావహులు వ్యతిరేకంగా మారి.. సాధారణ ఎన్నికల్లో తమపై, ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సాధారణ ఎన్నికల కోసం సిద్ధం చేసుకుంటున్న ఆర్థిక వనరులన్నీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖర్చయ్యే అవకాశం ఉంటుందని మథనపడుతున్నారు.

గ్రూపు రాజకీయాలు, ఆర్థిక వనరుల ఖర్చు, సాధారణ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని మంత్రులకు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నేతలకు మొరపెట్టుకుంటున్నారు. అన్ని పార్టీల్లో ఈ సమస్య ఉన్నా... కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుచేర్పులు, ఫిరాయింపులు వంటివి అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. 

గ్రూపుల లొల్లితో ఏం తట్టుకుంటాం? 
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక ఆధిపత్య పోరాటాలు సాధారణమే. గత ఎన్నికల వరకు తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు మినహా చాలా చోట్ల గ్రామస్థాయి వరకు రాజకీయ పార్టీల వైరుధ్యమే ఉండేది. తెలంగాణ ఏర్పడి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులంతా అధికార పార్టీలో చేరారు. ఇక ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల వెంట ఆయా పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కేడర్‌ అధికార పార్టీలోకి వచ్చింది.

ఇలా చాలాచోట్ల క్షేత్రస్థాయిలో అధికార టీఆర్‌ఎస్‌లో కేడర్‌ పెరిగిపోయింది. దీంతో గ్రామ, మండల స్థాయిలో అధికార పార్టీలోనే పోటీ పెరిగిపోయింది. చాలా మంది నాయకులు ఒకరితో మరొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. వారు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకు, పార్టీకి అనుకూలంగా ఉన్నా... క్షేత్ర స్థాయిలో తమకు అవకాశం రాకపోతే తిరుగుబాటు అభ్యర్థులుగానో, ఇతర పార్టీల్లో నుంచో బరిలోకి దిగే అవకాశాలున్నాయని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు వచ్చి ఒకరికి అవకాశమిస్తే.. మిగతావారు, మిగతా గ్రూపుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత అయితే.. అలాంటి వారిని ఏదైనా ఇతర పదవుల్లోకి తీసుకుంటామని, ఐదేళ్లు అధికారంలో ఉంటామని నచ్చచెప్పే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదే ఇప్పుడు వారు వినే అవకాశం తక్కువని పేర్కొంటున్నారు. 

ఆర్థికంగా పెనుభారం..! 
సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రావడం ఆర్థికంగా కూడా భారంగా మారుతుందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. గ్రూపులు, నేతల మధ్య పంచాయతీ ఒక సమస్య అయితే.. ఆర్థిక అంశం అంతకన్నా ఆందోళనకరమని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక అయ్యే ఖర్చుకంటే.. ఆ నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు రెట్టింపు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ‘‘ఒక నాయకుడికి మంచి పేరు ఉన్నా.. ఆర్థికంగా బలవంతుడు కాకపోవచ్చు. ఆర్థికంగా బలవంతుడైనా ఖర్చు పెట్టకపోతే ఇబ్బందే. నాకెందుకులే అని మౌనంగా ఉండే పరిస్థితి ఉండదు.

సాధారణ ఎన్నికలకు ముందు ఏ ఊరిలో సర్పంచ్‌ ఓడిపోయినా నష్టమే. గ్రామ పంచాయతీ స్థాయి ఎన్నికల్లో ఒక్కొక్క ఓటూ కీలకమే. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా.. స్థానిక సమస్యలు, వ్యక్తిగత వైరాలు, ప్రవర్తన వంటివన్నీ ప్రభావం చూపిస్తాయి. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు వస్తే సమస్యలు తప్పవు. అందుకే సాధారణ ఎన్నికలకు ముందు ఏ ఎన్నికలూ వద్దని పెద్దలకు స్పష్టంగా నా అభిప్రాయం చెప్పిన..’’అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొనడం గమనార్హం. స్థానిక ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయాలంటూ సీఎం, మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు