వదంతులు

26 Jul, 2018 12:35 IST|Sakshi

డీఎంకే వర్గాల్లో ఉత్కంఠ

నమ్మొద్దని స్టాలిన్‌ సూచన

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై బుధవారం పుకార్లు సాగాయి. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గోపాలపురంలో వైద్యుల హడావుడి పెరగడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో పుకార్లు షికార్లు చేశాయి. చివరకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మీడియా ముందుకు వచ్చి వదంతుల్ని నమ్మ వద్దని సూచించారు.

సాక్షి, చెన్నై :  డీఎంకే అధినేత ఎం.కరుణానిధి రెండేళ్లుగా అనారోగ్యం సమస్యలు,  వయోభారంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.  గోపాలపురంలోని మొదటి అంతస్తులో ఉన్న గదికే ఆయన పరిమితం అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన వెన్నంటి ఉన్నారు. ప్రధాన వీఐపీలు ఎవరైనా వచ్చిన సందర్భంలో కరుణానిధి గుమ్మం వరకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపిన సందర్భాలు అనేకం. అదే సమయంలో కలైంజర్‌ ఆరోగ్యంపై తరచూ ఉత్కంఠ, ఆందోళనలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత వారం ఆయన కావేరి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావడం ఆందోళనకు దారి తీసింది. చివరకు ఆయనకు గొంతు భాగంలో అమర్చిన ట్యూబ్‌ను తొలగించినట్టు వైద్యలు ప్రకటించడంతో డీఎంకే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు జోరందుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగా గోపాలపురానికి వైద్యులు వచ్చి వెళ్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

కరుణకు జ్వరం
వదంతులు జోరందుకోవడంతో గోపాలపురం వైపుగా డీఎంకే వర్గాల రాక పెరిగింది. దీంతో మీడియాల్లో హడావుడి ఊపందుకుంది. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై వివరణ కోరేందుకు గోపాలపురానికి పోటెత్తారు.

తొలుత వివరణ ఇచ్చే వాళ్లెవరూ లేక పోవడంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మీడియా ముందుకు వచ్చారు. కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు. వైద్యులు రాక గురించి ప్రశ్నించగా, ఆయనకు స్వల్ప జ్వరం వచ్చిందని, అందుకే వైద్యులు వచ్చి పరీక్షించి వెళ్లారన్నారు. వైద్యులు అందించిన చికిత్సతో కరుణానిధికి జ్వరం కూడా తగ్గిందని, ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దని పేర్కొన్నారు. కలైంజర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొంటూ, ఈ వదంతుల్ని ఎవరో పనిగట్టుకుని సృష్టిస్తున్నట్టుందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు