భక్తిలోనూ రాజకీయాలే!

19 Oct, 2018 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి సుప్రీం కోర్టు తీర్పు మేరకు అన్ని వయస్కుల మహిళలను అనుమతించకుండా ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్‌ సహా పలు హిందూ సంస్థల భక్తులు అడ్డుకుంటుండడంతో శుక్రవారం నాటికి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయ్యప్ప ఆలయానికి సరిగ్గా 23 కిలోమీటర్ల ఈవల నీలక్కళ్‌ వద్దనే ఓ టెంట్‌ వేసి ‘శబరిమల ఆచార సంరక్షణ సమితి’ బ్యానర్‌తో భక్తులు అయ్యప్ప ప్రార్థనలు జరుపుతున్నారు. అయ్యప్ప ఆలయానికి మొదటి ప్రవేశ మార్గంగా భావించే నీలక్కళ్‌ వద్దనే భక్తులతో వస్తున్న బస్సులను, ఇతర వాహనాలను ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఆపివేసి మహిళలను దించివేస్తున్నారు.

నీలక్కల్‌ వద్దనే ఆరెస్సెస్‌ టెంట్‌ వేయడంతో 1982లో చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్‌ నిర్వహించిన ఆందోళన గుర్తుకు వస్తోంది. నీలక్కల్‌లోని శివాలయానికి సమీపంలో చర్చి నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సంఘ్‌ పరివార్‌ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన కుమ్మనమ్‌ రాజశేఖరన్‌ నేడు మిజోరమ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అప్పుడాయన కేరళ విశ్వహిందూ పరిషత్‌ ప్రధాని కార్యదర్శిగా పనిచేశారు.
 

శివాలయానికి సమీపంలో శిలువ
1982కు కొన్నేళ్ల ముందు నీలక్కళ్‌ శివాలయానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో పెద్ద శిలువ దొరికిందన్న ప్రచారం జరిగింది. ఏసుక్రీస్తు 12 ముఖ్య ప్రచార బోధకుల్లో ఒకరైన థామస్‌ కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ చర్చిని నిర్మించారని, ఆ చర్చిలోని శిలువే బయటకు వచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో శిలువ దొరికినట్లు భావించిన చోట క్యాథలిక్‌ చర్చి సభ్యులు చిన్న గుడిసె వేసి ప్రార్థనలు జరపడం ప్రారంభించారు. అక్కడ చర్చి పునర్నిర్మాణం కోసం క్యాథలిక్‌ చర్చి ‘నీలక్కళ్‌ కార్యాలయ సమితి’ని ఏర్పాటు చేసింది. ఈ చర్చి ఆందోళనను అడ్డుకోవడానికి సంఘ్‌ పరివార్‌ కొచ్చీలో హిందీ మహా సమ్మేళనాన్ని నిర్వహించింది. శివాలయం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదంటూ ఆ సమ్మేళనం హిందువులకు పిలుపునిచ్చింది.

1982, మే 19న చర్చికి స్థలం కేటాయింపు
అప్పటి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం ఇరు మతాల వారిని మంచి చేసుకోవడంలో భాగంగా శివాలయానికి నాలుగు కిలీమీటర్ల దూరంలో చర్చి నిర్మాణాకి ఓ హెక్టార్‌ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా వీహెచ్‌పీ నాయకుడు రాజశేఖరన్‌ నాయకత్వాన ఆరెస్సెస్‌ కార్యకర్తలు తిరువనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న కారణంగా వెయ్యి మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు నాడు అరెస్టయ్యారు. అయినా చర్చి నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారు. ‘ఆ చర్చి ప్రభుత్వం మతతత్వ వాదానికి ప్రతీక, ఓట్ల కోసం ఆడిన నాటకం’ అని నాడు రాజశేఖరన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వమర్శించారు. నాటి ఆందోళనతో కేరళలో హిందూ సంఘాలు కాస్త బలపడ్డాయి.

మద్దతిచ్చి మాటమార్చిన ఆరెస్సెస్, బీజేపీ
అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సెప్టెంబర్‌ 28వ తేదీన సుప్రం కోర్టు ఇచ్చిన తీర్పును అదే రోజు ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు స్వాగతించాయి. లింగ వివక్ష లేకుండా భక్తులందరికి సమాన హక్కులు ఉంటాయని, అందుకే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆరెస్సెస్‌ రాష్ట్ర కార్యదర్శి పీ గోపాలన్‌కుట్టీ వ్యాఖ్యానించారు. ఆలయ ప్రవేశం విషయంలో లింగ వివక్షను ఎంత మాత్రం అనుమతించేది లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ మూడవ తేదీ నాటికి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఇద్దరు మాట మార్చేశారు. ఆరెస్సెస్‌ ప్రత్యక్షంగా ఆందోళనలోకి దిగి భక్తుల ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. ఎవరిది మాత్రం ఓట్ల రాజకీయం కాదు?

మరిన్ని వార్తలు