మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చుక్కెదురు

2 Jul, 2018 11:48 IST|Sakshi
చౌకధరల దుకాణంలో కందిపప్పు తనిఖీ చేస్తున్న పౌరసరఫరాల మంత్రి

సాక్షి, విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకునేందుకు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం సాయంత్రం లబ్బీపేటలోని 237 వ నెంబరు చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక మహిళను బియ్యం, కందిపప్పు, పంచదార ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించగా.. ఆమె పెదవి విరిచింది. పంచదార సన్నగా ఉంటోందని, కందిపప్పులో పురుగులున్నాయని మంత్రి దృష్టికి తెచ్చింది.  రేషన్‌ దుకాణంలోని కందిపప్పు, పంచదారను తెప్పించి పరిశీలించారు.

పంచదార పరిమాణం తక్కువగా ఉండటంతో ఆయన నీళ్లు నమిలాడు. వెంటనే ఆ పంచదారను ల్యాబ్‌కు పంపాలని అధికారుల్ని ఆదేశించారు. కందిపప్పు పరిశీలించిన అనంతరం తూకంలో తేడా వస్తోందని తెలుసుకున్నారు. కొన్ని చోట్ల డీలర్లు పంపిణీ చేసే కందిపప్పులో తూకంలో కొద్దిగా తేడా వస్తుందని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్స్‌ నుంచి డీలరుకు కందిపప్పు సంచితో కలుపుకుని 50 కేజీలు 600 గ్రాములు రావాల్సి ఉండగా కొన్ని చోట్ల 49,600 మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ తేడాను సరిచేసి పంపిణీ చేస్తామన్నారు. మంత్రితో పాటు డీఎస్‌ఓ జి. నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు