‘ముందస్తు’పై కేసీఆర్‌ జవాబు చెప్పాలి 

15 Oct, 2018 01:49 IST|Sakshi

కేంద్రమంత్రి సదానందగౌడ

ఆమనగల్లు: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర గణాంక, పథకాల అమలు శాఖ మంత్రి డీవీ సదానందగౌడ డిమాండ్‌ చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్‌ ఓటమి భయంతోనే ముందస్తుకు సిద్ధమయ్యారన్నారు. త్రిపుర మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ బీజేపీ అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఆమనగల్లులో ని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగించారని ఆరోపించారు. బీజేపీకి ఆదరణ పెరగడంతో భయపడి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారన్నారు. సచివాలయానికి వెళ్లకుండా పాలన సాగించిన మొదటి సీఎం కేసీఆరే కావొ చ్చని వ్యాఖ్యానించారు. సీఎంను సహచర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కలవలేక పోతున్నారని, ఒవైసీ సోదరులు, కేటీఆర్, కవితలకు మాత్రం తలుపులు బార్లా తెరిచి ఉంచారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు.  

సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌ది.. 
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని సదానంద గౌడ చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కేసీఆర్‌ తానే నిధులు తెచ్చి ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నారని, సొమ్ము కేంద్రానిదైతే సోకు కేసీఆర్‌ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ.5,200 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో రూ.165 కోట్లతో ఫుడ్‌పార్క్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.రాష్ట్రంలోని 7.92 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమాను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం రూ.4,265 కోట్లను రాష్ట్రానికి కేటాయించిందని గుర్తు చేశారు.    

మరిన్ని వార్తలు