బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌

17 Apr, 2019 14:34 IST|Sakshi

భోపాల్‌ నుంచి డిగ్గీ రాజాపై సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ పోటీ..

భోపాల్‌ : మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ప్రజ్ఞాసింగ్‌ భోపాల్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ప్రభాత్ ఝా, నరోత్తమ్ మిశ్రా, రామ్ లాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. మంగళవారమే తాను బీజేపీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లు చెప్పిన ఆమె పార్టీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని, గెలుస్తానని కూడా ప్రజ్ఞాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజ్ఞాసింగ్‌ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం ఆమె పేరును అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌పై ప్రజ్ఞాసింగ్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. సుమారు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆమె ఈ కేసులో ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా