పోలీసులు తీవ్రంగా హింసించారు

19 Apr, 2019 04:34 IST|Sakshi
కార్యకర్తలతో మాట్లాడుతూ కంటతడిపెట్టుకున్న ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌

వెడల్పాటి బెల్టుతో కొట్టేవారు

బీజేపీ కార్యకర్తలతో రోదిస్తూ చెప్పిన సాధ్వి ప్రజ్ఞ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న, మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మానస్‌ భవన్‌లో ఆమె మాట్లాడుతూ విచారణ సమయంలో పోలీసులు తనను ఏవిధంగా హింసించిందీ రోదిస్తూ వివరించారు. ‘పోలీసులు నన్ను అక్రమంగా 13 రోజులు బంధించారు. ఆ సమయంలో వెడల్పైన బెల్టుతో నన్ను కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు.

తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత దిగ్విజయసింగ్‌పై ప్రస్తుతం ప్రజ్ఞ పోటీ చేస్తున్నారు. దిగ్విజయ హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని  ఆరోపించారు. మాలెగావ్‌ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు