మాజీమంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు

16 Jan, 2020 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడుగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎన్‌.తులసిరెడ్డి, మస్తాన్‌ వలీని నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తుందని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 

కాగా గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే రఘువీరారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను గత ఏడాది మే నెలలో కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా, అప్పటి నుంచి రఘువీరా రాజీనామాను కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించలేదు. రఘువీరా తన పట్టు వీడకపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. పార్టీ నేతలు సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌, సుంకర పద్మశ్రీ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సాకే శైలజానాథ్‌కు దక్కింది.

పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేస్తా..
పీసీసీ చీఫ్‌గా నియమకంపై  శైలజానాథ్‌ ఈ సందర‍్భంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ల అనుభవాలను కలుపుకుని ఏపీలో ముందుకు వెళతామని శైలజానాథ్‌ పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ఇంకా కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరికొన్ని రోజుల్లోనే రాజధాని అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారి అభీష్టం నెరవేర్చేలా పోరాడతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ  రానున్న ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీ ...ప్రజల ఆలోచనలు, కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు