‘బాబుది డబ్బులు దండుకునే గ్యాంగ్‌’

23 Jan, 2020 20:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అమరావతిని రాజధానిగా కాకుండా.. ఓ ఆర్ధిక వనరుగా చూశారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి యువజన విభాగాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. నూజివీడు దగ్గర రాజధాని అని, సగం మందిని ముంచి రాత్రికి రాత్రే డబ్బులు ఎలా దండుకోవాలనే ఆలోచలు ఉన్న గ్యాంగ్ చంద్రబాబు వద్ద ఉందని ఆయన మండిపడ్డారు. ఆ విషయం రాజధానిలో నాలుగువేల ఎకరాలు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తేటతెల్లం అయిందని ఆయన తెలిపారు. చద్రబాబు తన వద్ద పని చేసే 900 మంది తెల్లరేషన్‌ కార్డుదారులతో ఈ చర్యకు పాల్పడ్డారు. వంద అడుగుల లోతులో అమరావతి పిల్లర్లు వేసి భవనాలు కట్టిన పరిస్థితి చూశాం. ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా  చంద్రబాబు నిర్మించలేదని సజ్జల తీవ్రంగా విమర్శించారు.

ప్రధానమంత్రి శంకుస్థాపన చేసింది ఒకచోటైతే.. భవనాలు కట్టింది మరొకచోటని సజ్జల అన్నారు. చంద్రబాబు అక్రమయజ్ఞం పూర్తి కాలేదు కాబట్టే రాజధానికి ఇంత సమయం పట్టిందని ఆయన దుయ్యబట్టారు. అడ్డగోలుగా చేసిన చర్యలపై కేసులు ఉంటాయని, శిక్ష కూడా  పడుతుందని సజ్జల అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కులం మీద ద్వేషం ఉంటే రాజధాని వినుకొండ తీసుకువెళతారు, కానీ వైజాగ్ ఎందుకు తీసుకువెళతారని చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు. శాసనమండలిలో చైర్మన్ తప్పుచేశానని ఒప్పుకున్నారు. చంద్రబాబు ఎందుకు గ్యాలరీలో కూర్చున్నాడో ప్రజలు గమనించారని సజ్జల అన్నారు. ​చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ఆపలేరని సజ్జల స్పష్టం చేశారు.

అధికారం కేంద్రీకృతం అయితే ప్రమాదం:
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ప్రజలు ఎంత విశ్వాసంతో అధికారం కట్టబెట్టారో అంత బాధ్యతగా  పాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం సీఎం జగన్‌ పాటుపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారం కేంద్రీకృతం అయితే ప్రమాదమని సీఎం జగన్‌ గుర్తించారు. అందుకోసం గాంధీ గ్రామ స్వరాజ్యానికి తన పాలన జోడించారని సజ్జల తెలిపారు. అభివృద్ధి చెందిన నగరంలో రాజధాని అయితే వ్యయం తక్కువ అవుతుందని సీఎం ఆలోచించారని ఆయన గుర్తు చేశారు.

ఉద్యోగులు ఆనందంగా షిఫ్ట్ అవుతామని చెబుతున్నారని సజ్జల అన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విజయవాడ ఫ్లై ఓవర్ పూర్తి కాలేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్లల్లో చేయలేని పనులు సీఎం జగన్‌ కేవలం ఏడు నెలల్లో చేసి చూపారని ఆయన అన్నారు. రీజినల్ యూనిట్స్‌కు ప్రధాన్యత వుంటుందని.. వికేంద్రీకరణపై అడ్డగోలుగా కాకుండా కమిటీలు వేసి నిపుణులతో నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పోరాటయోధుడు, ప్రజలతో మమేకమయ్యే నాయకులు సీఎం జగన్‌ అని సజ్జల కొనియాడారు. ఐదు కోట్ల మంది భవిష్యత్ తన భవిష్యత్తు అనే నాయకుడు సీఎం జగన్‌ అని సజ్జల అన్నారు. చంద్రబాబువి వీధి రాజకీయాలని.. సీఎం జగన్‌వి స్ట్రెయిట్ పాలిటిక్స్ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జక్కంపూడి రాజా, 13 జిల్లాల వైఎస్సార్‌సీపీ విద్యార్థి యువజన విభాగాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు