గాంధీ ముందు గాడ్సేలా.. ఎన్టీఆర్‌ విగ్రహం ముందు చంద్రబాబు పోజు

20 Jan, 2019 03:52 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం  

టీడీపీ డీఎన్‌ఏను కాంగ్రెస్‌ డీఎన్‌ఏగా చంద్రబాబు మార్చేశారు

జగన్‌ను కేటిఆర్‌ కలిస్తే టీడీపీకి పూనకం ఎందుకు? 

హోదాకు మద్దతిచ్చే వారితో చర్చలు జరిపితే నేరమా?

సాక్షి, హైదరాబాద్‌:  మామకే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు సత్తెనపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పోజులివ్వడం చూస్తే ‘మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆయన్ను హత్య చేసిన గాడ్సే’ నిలబడినట్లుగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీని హత్య చేసిన గాడ్సేకన్నా చంద్రబాబు క్రూరమైన, ఘోరమైన వ్యక్తి అని ఎన్టీఆర్‌ స్వయంగా గతంలో అనేక పర్యాయాలు విమర్శించారని సజ్జల గుర్తు చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదికల నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా ఒకటన్నారు.  

ఉత్తుత్తి ప్యాకేజీకి ఒప్పుకున్నది మీరు కాదా...
చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగి ఏపీకి ఏమీ సాధించలేక పోయారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను వదులుకుని కంటి తుడుపుగా ఉత్తుత్తి ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు. ప్యాకేజీ ప్రకటించినందుకే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కీర్తించిన విషయం మీరు మరిచినా ప్రజలు మరవరన్నారు. ఇదే సందర్భంలో ప్యాకేజీ వల్ల ఒరిగేదేమీ ఉండదని, నష్ట పోయిన రాష్ట్రానికి హోదాయే శ్రీరామరక్ష అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ గట్టిగా నినదిస్తున్నారన్నారు. ఇపుడు చంద్రబాబు  జాతీయ ప్రత్యామ్నాయం డ్రామాతో సరికొత్త వేషం వేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ వ్యతిరేకత అనే మౌలిక విధానాలపైనే టీడీపీ పుట్టిందని, అది టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని టీడీపీ డీఎన్‌ఏనే మార్చేశారని దుయ్యబట్టారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు పరస్పరం సహకరించు కోవడం.. కేంద్ర ప్రభుత్వ అనవసర పెత్తనాన్ని సవాలు చేయడం.. తమకున్న హక్కులు, అధికారాలను పరిరక్షించుకునేందుకు రాష్ట్రాలు పోరాడాలనేదే కేసీఆర్‌ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు.

ఈవిషయంలో కేసీఆర్‌ ప్రయత్నాలకు వైఎస్‌ జగన్‌ హర్షాన్ని ప్రకటించారని అన్నారు. దాంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిం చేందుకు కేంద్రానికి లేఖ రాస్తానని కేసీఆర్‌ ముందుకు రావడం వైఎస్సార్‌సీపీ హర్షిస్తోందని, ఇదే విషయాన్ని జగన్‌ బహిరంగంగానే ప్రకటించారని ఇందులో దాపరికమే లేదన్నారు. ఏపీకి హోదా వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముందుకు వచ్చిన కేసీఆర్‌తో జగన్‌ సమావేశం కావడంపై టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని, ఉన్మాదుల్లాగా విమర్శలు చేస్తున్నారన్నారు.  చంద్రబాబు టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో పొత్తుల గురించి ప్రస్తావించింది మరిచారా? అని ఆయన ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశం లేదు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కేసీఆర్‌ ప్రయత్నం. అందులో ఎవరైనా చేరవచ్చు.. చేరకపోవచ్చు. ఫెడరల్‌ ఫ్రంట్‌ను బూచిగా చూపిస్తూ నీచానికి పాల్పడుతున్నారు. 

చంద్రబాబు నాలుగున్నరేళ్ల గాఢ నిద్ర... 
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉండి ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేటప్పటికి హడావుడిగా ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నారని సజ్జల అన్నారు.  ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ పేరుతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. హోదాకు మద్దతు ఇచ్చే వారితో చర్చలు జరిపితే అది నేరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్షం ఏం చేస్తోందని కళా వెంకట్రావు తన బహిరంగ లేఖలో ప్రశ్నించారని, అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌ దీక్షలు, పోరాటాలు నిర్వహించారని, ఏపీ ప్రభుత్వం మేలుకోవాలని, ట్రిబ్యునల్‌ ముందు వాదనలను సమర్థంగా వినిపించాలని అనేక పýర్యాయాలు కోరారనీ గుర్తు చేశారు. అవేవీ చంద్రబాబు చెవికెక్కలేదని ధ్వజమెత్తారు. అటు కాంగ్రెస్‌ ఇటు బీజేపీ రెండూ రాష్ట్రానికి మోసం చేశాయని జగన్‌ పలు సార్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు.   

మరిన్ని వార్తలు