డీజీపీనీ పక్కన పెట్టాల్సిందే

28 Mar, 2019 04:58 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అక్రమాల్లో ఆయనా భాగస్వామే

ఇంటెలిజెన్స్‌ డీజీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి

ఎమ్మెల్యేల కొనుగోలుకు రేట్లు ఫిక్స్‌ చేసింది ఆయనే 

ఫరూక్‌ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తాం 

కేఏ పాల్‌తోనూ చంద్రబాబు కుట్ర

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలకు ముందు రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్‌ డీజీతో సహా మరో ఇద్దరు ఎస్‌పీలను విధుల నుంచి పక్కన బెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానిస్తోందని, అయితే రాష్ట్ర డీజీపీని కూడా విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అక్రమాలన్నీ డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ ఇద్దరూ కలిసే చేశారని అందుకే వీరిద్దరికీ వ్యతిరేకంగా తాము పోరాడతున్నామని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 

దావూద్‌ నెట్‌వర్క్‌ తరహాలో ఇంటెలిజెన్స్‌
సీఎం చంద్రబాబు నాయుడు ఓ నియంతలా పాలిస్తున్నారని, ఇంటెలిజెన్స్‌ యంత్రాగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని ధ్వజమెత్తారు. దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్‌ తరహాలో ఇంటెలిజెన్స్‌ను తయారు చేశారని, ఈ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటుగా ఐఏఎస్‌ అధికారులపైనా నిఘా పెట్టారన్నారు. అక్రమాల అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంతో.. ప్రపంచం తలకిందులైనట్లుగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో కుమ్మక్కు అయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని 40 ఏళ్లు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు తెలియదా? అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉండగా అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను బదిలీ చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తే.. అపుడు ఎన్నికల సంఘం బదిలీ చేసిందన్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, తన టెలిఫోనును టాప్‌ చేస్తుస్తున్నట్లు గుర్తించామని చెబుతూ.. సంబంధిత ప్రతులను ప్రదర్శించారు. దీనిపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎంఎల్‌సీ బుద్దా వెంకన్న ఈ మధ్య మాట్లాడుతూ దేవినేని అవినాశ్‌ను ఏపీ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించాలని ఇంటెలిజెన్స్‌ అధికారి వెంకటేశ్వరరావును కోరామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టింది ఈ అధికారేనని, వారికి రేట్లను నిర్ధారించిందీ ఈయనేనన్నారు. ఒక అధికారిగా కాకుండా ఒక బ్రోకరుగా ఆయన వ్యవహరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముస్లిం ఓట్ల కోసం నీచ రాజకీయాలు
ఎన్నికలలో ముస్లిం ఓట్ల కోసం జమ్ము–కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాని ఆహ్వానించి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల అన్నారు. ఆయనపై తమ పార్టీ పరువు నష్టం దావా వేయనుందని చెప్పారు.  వైఎస్సార్‌ మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇస్తానని జగన్‌ అన్నట్లు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన ప్రకటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని విమర్శించారు. పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు 40 రోజుల ముందు అప్పటి ఎస్పీని బదిలీ చేశారని, ఆయన నిజాయితీ పరుడని, ముక్కు సూటి మనిషని హడావుడిగా మార్చి తమ మాట వినే అధికారిని ఎస్‌పీగా నియమించారని విమర్శించారు. హంతకులను, కుట్రదారులను, సూత్రధారులను పోలీసులు విచారించడం లేదని, వైఎస్‌ కుటుంబ సభ్యులనే విచారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతోన్న చంద్రబాబునే డిస్మిస్‌ చేయాలని తమ పార్టీ కోరుతోందని చెప్పారు.  ఎన్నికల్లో అయోమయం సృష్టించేందుకు కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ గుర్తును ఉపయోగిస్తున్నారని తమ పార్టీ గుర్తు ఫ్యానును పోలి ఉండేలా హెలీకాప్టర్‌ రెక్కలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించనుందని సజ్జల  స్పష్టం చేశారు. 

పెంట్‌ హౌస్‌ నుంచే అక్రమ వ్యవహారాలు
ఇంటెలిజెన్స్‌ డీజీ నిఘా వ్యవస్థకు సాంకేతిక పద్ధ్దతులను మేళవించారని, తన ఆఫీసు పెంట్‌ హౌస్‌నే అక్రమాలకు అడ్డాగా చేసుకుని వ్యవహారాలను నడుపుతున్నారన్నారు. ఆయనకు తోడుగా రిటైర్డు పోలీసు అధికారి యోగానంద్, ఘట్టమనేని శ్రీనివాస్‌ పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నీ వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినపుడు యుద్ధ్ద ప్రాతిపదికన కొన్ని రికార్డులను కాల్చి వేశారని, మరి కొన్నింటిని ధ్వంసం చేశారని చెప్పారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే కంప్యూటర్లను అక్రమంగా హ్యాక్‌ చేసేందుకు వీలుగా తగిన శిక్షణ పొందిన వారిని హ్యాకర్లుగా ప్రభుత్వం నియమించిందన్నారు. ఘట్టమనేని శ్రీనివాస్‌ నేతృత్వంలో అమరనాథ్‌ నాయుడు, రాంకుమార్, నండూరి సుబ్బారావు, ఆదినారాయణ, శ్రీనివాస్‌ భక్తవత్సలం, కేసప్ప, రాజీవ్‌ మురళీ పనిచేస్తున్నారని, వీరికి చంద్రబాబుతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందని వివరించారు.

దేశంలోనే మంచి పేరున్న మన పోలీసు వ్యవస్థలో పది శాతం మందిని భయపెట్టో, బెదిరించో, లొంగ దీసుకుని తమ అక్రమ వ్యవహారాలను చంద్రబాబు చక్కదిద్దుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మీటర్ల పరిధిలో టెలిఫోన్లను ట్రాక్‌ చేసేందుకు చిన్న వాహనంలో నూతన సాంకేతిక పరికరాలను అమర్చు కుని ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు.  ఈ  ఆధునిక పద్ధతికి మించి మరో పద్ధతిని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ అమెరికాకు వెళ్లి అక్రమంగా కొనుగోలు చేసినట్లు  తమ దగ్గర సమాచారం ఉందన్నారు.  దీని ద్వారా ఫోన్లలో మాట్లాడే మాటలు వారికి చేరుతాయని ఎస్‌ఎంఎస్‌లు తెలిసి పోతాయన్నారు. వాట్సాప్‌ సమాచారం కూడా క్షణాలలో వారికి చేరుతోందన్నారు. పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయితే రెగ్యులర్‌ పోలీసు అధికారులతో పాటు అదనంగా 80 మంది అధికారులను నియమించి విచారణ చేపడుతున్నారని అన్నారు. 

మరిన్ని వార్తలు