ఓటమికి ముందే సాకులు వెతుకుతున్న బాబు

10 Mar, 2020 06:09 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

స్థానిక ఎన్నికల్లో గెలవలేమని చేతులెత్తేసి మాపై ఆరోపణలా? 

టీడీపీ పోటీ చేయకపోవడం మంచిదనే రాతలెందుకు?   

ఎన్నికల్లో డబ్బు, మద్యం కనిపించకూడదంటే భయమెందుకు?

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అవమానకరమైన ఓటమికి చంద్రబాబు ముందే కారణాలు వెతుక్కుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారుడిని సైతం గెలిపించుకోలేని చంద్రబాబు.. టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి టీడీపీ పోటీ చేయక పోవడం మంచిది అంటూ తనకు వత్తాసు పలికే ఆంధ్రజ్యోతిలో రాయిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం చూస్తుంటే చంద్రబాబు ఏ స్థాయిలో భయపడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని భయపెడుతోందని, అందుకే తాము పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటూ చేతులెత్తేస్తున్నారన్నారు. తమ ఓటమికి వైఎస్‌ జగన్‌ కారణమంటూ ముందే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని చెప్పారు.  

వ్యవస్థలో మార్పునకు శ్రీకారం 
ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎక్కడా కనిపించకుండా సీఎం చర్యలు తీసుకున్నారని, ఈ నిబంధన అధికార పక్షానికి ఉపకరించక పోయినా ఒక మార్పు కోసం సాహసం చేస్తున్నామని సజ్జల చెప్పారు. ప్రతిపక్షానికి బలాన్నిచ్చే ఈ నిబంధనలను ఉపయోగించుకుని ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిపోయి, బరిలోకి దిగకుండానే చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారని అర్థం అవుతోందన్నారు. వ్యవస్థలో మార్పు కోసం స్థానిక సంస్థల ఎన్నికలను ఆదర్శంగా తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని చెప్పారు. బీసీలను టీడీపీ ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబువన్నీ దుర్మార్గపు ఆలోచనలేనని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ కేవలం 9 నెలల్లో చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పారు. వాస్తవానికి ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా సమయం పడుతుందని, అయినా తాము ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నామన్నారు.  

దిగజారుడు రాజకీయం వద్దు 
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇది ప్రజల్లో మమేకమైన పార్టీ.   
బీసీల రిజర్వేషన్ల మీద 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో అఫిడవిట్‌ వేసింది. వారు 50 శాతం చాలు అన్నారు. మేము 59 శాతం పైగా కావాలని ప్రతిపాదనలు చేశాం. దీనిపై టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులురావు. ఆ నెపాన్ని మాపై వేయాలని బాబు ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితిలో బీసీలకు అదనంగా పార్టీ తరఫున 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు.  
- రాష్ట్రమంతా అమరావతిని కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే అంశంతో ఓటర్ల వద్దకు వెళ్లాలి. ఎవరు ఎవర్ని బెదిరిస్తున్నారో చంద్రబాబే చెప్పాలి.   
వైఎస్‌ జగన్‌ పాలనలో తప్పేమిటో విపక్షాలు చెప్పలేకపోతున్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వడం తప్పా? జీతాలు పెంచడం తప్పా? దిశ చట్టం తేవడం తప్పా? ఇంగ్లిష్‌ మీడియం తప్పా? అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోవడం తప్పా? అవసాన దశలో ఉన్న టీడీపీ దిగజారుడు రాజకీయాలు, దిక్కుమాలిన ఆరోపణలు మానుకోవాలి.

మరిన్ని వార్తలు