పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

20 Feb, 2020 05:08 IST|Sakshi

‘మీట్‌ ది మీడియా’లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

ఉన్న వనరుల సద్వినియోగంతోనే రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక  

8 నెలల్లోనే 80 శాతం హామీలు నెరవేర్చి ప్రజారంజక పాలన  

ముస్లిం మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం 

అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమే

సాక్షి, అమరావతి :  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో కేవలం స్వార్థ బుద్ధితో వ్యవహరించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం పాలనా వికేంద్రీకరణకు పూనుకున్నారన్నారు. వాస్తవానికి చంద్రబాబుకు ఇక్కడ రాజధాని కట్టాలన్న ఆలోచన లేనే లేదని, దానిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించాలన్నదే లక్ష్యం అని విమర్శించారు. స్థానిక ఐలాపురం హోటల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

అమరావతిలో వర్షాలు వస్తే వరద సమస్య వస్తుందని తెలుసని.. లింగమనేని వంటి వారికి, తన అనుయాయులకు మేలు చేసేందుకే రూ.లక్ష కోట్లతో రాజధాని అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేస్తే తప్ప అమరావతిలో కనీస వసతులు కూడా కల్పించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపైనే ఇంత భారీగా ఖర్చు చేస్తే ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ, నీటి పారుదల ప్రాజెక్టుల సంగతేమిటన్నారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో పాలనాపరమైన రాజధాని, ఇపుడున్న చోట శాసన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే జగన్‌ సంకల్పమని తెలిపారు. ఒకే చోట లక్ష కోట్లు ఖర్చు
పెట్టి కొత్త రాజధాని నిర్మించే కన్నా, అందుబాటులో ఉన్న నగరాన్ని తీర్చి దిద్ది ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే విశాఖపట్టణాన్ని ఎంచుకున్నారన్నారు.  

సీఎం జగన్‌ మనసున్న నేత 
సీఎం జగన్‌ అన్ని వర్గాల ప్రజలకు వీలైనంత ఎక్కువ మేలు చేయాలని చూస్తున్నారని సజ్జల చెప్పారు. రూ.90 వేల కోట్ల అప్పుతో ఉన్న ఏపీ.. చంద్రబాబు పుణ్యమా అని రూ.2.60 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. పైగా ఆయన దిగిపోతూ రూ.60 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు నెత్తిన వేసి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ దూర దృష్టితో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, నాడు–నేడు కింద పాఠశాలలు.. ఆసుపత్రుల అభివృద్ధి, వైఎస్సార్‌ కంటి వెలుగు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటు.. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, 1.50 లక్షల శాశ్వత ఉద్యోగాలు.. ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలతో అనతి కాలంలో దాదాపు 80 శాతం హామీలు నెరవేర్చి, ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు వేదికపై ఆసీనులయ్యారు.

సీఏఏపై ఆందోళన చెందొద్దు   
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ సీఏఏకు మద్దతు ఇచ్చినప్పుడు ఎన్‌పీఆర్‌–ఎన్‌ఆర్‌సీలు లేవన్నారు. పొరుగు దేశాల నుంచి చొరబాట్లు, అక్రమ వలసలు నిరోధంలో భాగంగా దేశ భద్రత దృష్ట్యా పార్లమెంటులో సీఏఏకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిందనే విషయాన్ని తమ పార్టీ అప్పుడే స్పష్టంగా ప్రకటించిందన్నారు. ఆ తర్వాతే ఎన్‌ఆర్‌సీ అంశం వచ్చిందన్నారు.  ముస్లిం మైనారిటీల్లో నెలకొన్న ఆందోళన విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులను రానివ్వబోమని ఆయన చెప్పారు. ‘ఎవరైనా మమ్మల్ని దాటుకుని వెళ్లే.. ఆ చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ఆందోళన చెందాల్సిన పనే లేదు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు