విపత్తులోనూ శవ రాజకీయాలా?

4 Apr, 2020 03:35 IST|Sakshi

టీడీపీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహం

కోతలు, వడపోతలు బాబు నిర్వాకమే  

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష టీడీపీ విపత్కర సమయంలోనూ శవ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడారు. 

► ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబు ఇవాళ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. కరోనా వల్ల ప్రభుత్వాలపై ఊహించని రీతిలో అదనపు భారం పడింది. మేం ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లు విపక్షం ఆరోపణలు చేస్తోంది. వాస్తవానికి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.2 వేల కోట్లు. పేదల ఇళ్ల స్థలాలు, భూసమీకరణకు రూ.1,600 కోట్లు, ఆరోగ్యశ్రీ, పింఛన్లకు రూ.1,500 కోట్లు చెల్లించాం.
► విభజన సమయంలో రూ.90 వేల కోట్లు అప్పులుంటే చంద్రబాబు వచ్చాక బిల్లులు, అప్పులతో కలిపి రూ.3 లక్షల కోట్ల పై చిలుకు భారం పడింది.  ఫీజు రీయింబర్స్‌మెంటు పెండింగ్‌ రూ.1,200 కోట్లు, రైతుల ధాన్యం బకాయిలు రూ 900 కోట్లు , ఆరోగ్యశ్రీకి రూ.650 కోట్లు మా ప్రభుత్వం వచ్చాక చెల్లించాం.   
► కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను వివరించి జీతాలు రెండు విడతలుగా చెల్లిస్తామన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించి  ఔదార్యం చూపాయి.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీకి కూడా వివరించారు.  
► టీడీపీ నేతలు కోడిగుడ్డుపై ఈకలు పీకడం మానుకోవాలి. ప్రజలకు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలన్నది ముఖ్యమంత్రి విధానం. కోతలు పెట్టాలనే ఆలోచన ఆయనకు లేదు. కోతలు, వడపోతలు చంద్రబాబుకే చెల్లుతాయి. 
► కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం శనివారం బియ్యం కార్డుదారులకు రూ.వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేస్తోంది. పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పేదలకు సాయం అందేలా చూడాలి. 

1.28 కోట్ల ఇళ్లల్లో సర్వే
► జమాత్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయి.
► రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 కోట్ల ఇళ్లల్లో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉన్నవారిని గుర్తిస్తున్నాం మలిదశలో వారికి డాక్టర్లతో వైద్య పరీక్షలు చేసి వారి సలహా మేరకు నిర్థారణ పరీక్షలు, అవసరమైతే క్వారంటైన్‌కు తరలిస్తాం. 
► ఢిల్లీలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశాం. వారు ఇంకా ఎవరితో కాంటాక్ట్‌ అయ్యారో వివరాలు సేకరిస్తున్నాం. 
► ‘వైరస్‌ సోకిన వారుంటే మీ కోసం మీ పిల్లలకోసం వైద్య పరీక్షలకు ముందుకు రావాలి’ అని సూచించిన ముఖ్యమంత్రి పిలుపు పట్ల స్పందించాలని కోరుతున్నాం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా