బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా తొలి ఏడాది

24 May, 2020 03:56 IST|Sakshi

అగ్ని పరీక్షను అధిగమించి సీఎం వైఎస్‌ జగన్‌ అన్నీ చేశారు 

ఇప్పటికే 90శాతం మేనిఫెస్టోను అమలుచేశారు 

హామీ ఇవ్వని మరో 40 కార్యక్రమాలు కూడా.. 

ముఖ్యమంత్రికి వందశాతం మార్కులు 

వచ్చే నాలుగేళ్లూ స్వర్ణ యుగమే 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించిన తొలి ఏడాది బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా నిలిచిందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే నాటికి నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఆయన ఒక అగ్ని పరీక్షలాగా ఎదుర్కొని అధిగమించారని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని 175కు గాను 151 స్థానాలు, మొత్తం 25కు గాను 22 లోక్‌సభ స్థానాలు పొంది అఖండ విజయం సాధించి సరిగ్గా శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టిన తరువాత పాలన ఎలా ఉంటుందోనని విశ్లేషకులు, రాజకీయ వాదులు అందరూ చూశారని.. అయితే, ఈ ఏడాది దానికి సమాధానంగా నిలుస్తుందని సజ్జల అభిప్రాయపడ్డారు. 
► ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఆయనకున్న పూర్తి స్వేచ్ఛను, ఆలోచనా విధానాలతో ఈ ఏడాదిలో జగన్‌ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకువెళ్లారన్నారు. 
► తొలి ఏడాదిని సంక్షేమ నామ సంవత్సరంగా నామకరణం చేస్తే అందులో ఆయనకు వంద శాతం మార్కులు వస్తాయన్నారు.  
► జగన్‌ పాలనను రాజకీయ కారణాలతో ఎవరైనా వ్యతిరేకించొచ్చు తప్ప సంక్షేమ ఫలాలు తమకు అందలేదని చెప్పే వారు కనిపించరని సజ్జల అన్నారు. 

ప్రజలకు అందుబాటులో పాలన
► గ్రామ వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లారని, అది విప్లవాత్మకమైన చర్య అని సజ్జల ప్రశంసించారు. అలాగే..
► మేనిఫెస్టోలోని 90 శాతం అంశాలను అమలుచేయడమే కాక హామీలివ్వని మరో 40 కార్యక్రమాలను కూడా వైఎస్‌ జగన్‌ అమలుచేశారన్నారు. 
► తన ఆలోచనలను చెప్పీ చెప్పక ముందే గ్రహించి అమలుచేసే అధికారులను తయారు చేసుకోగలిగారన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఏపీలో నిజమైన స్వర్ణయుగంగా ఉంటుందని.. 2024 వరకు ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి అనుగుణంగా వారికి ఏం చేయాలో క్యాలెండర్‌ తయారుచేసుకుని మరీ ముందుకెళ్తున్నారని సజ్జల వివరించారు. 
ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు గుంటూరు పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు పేదలకు దుస్తులను పంచి పెట్టారు. నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు కూడా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు