చరిత్ర గతిని మార్చే పాలన

31 May, 2020 04:57 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు

తొలి వార్షికోత్సవంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో చరిత్ర గతిని మార్చే పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ స్వరూపాన్ని మార్చి వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఆయన ఉపక్రమించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
జగన్‌ పాలన ఏడాది పూరై్తన సందర్భంగా విశాఖలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు   

► ఈ ఏడాదిలో ఏం చేశాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని సీఎం జగన్‌ స్వయంగా వివిధ రంగాల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. 
► ఈ కార్యక్రమం ప్రజలను మభ్య పెట్టడానికో, అరచేతిలో వైకుంఠం చూపడానికో కాదు. తాను ఎంత శ్రద్ధగా పని చేశాననేది తెలుసుకోవడానికి.
► రాజన్న బిడ్డగా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వ నాయకుడిగా ప్రజలు అభిమానించారన్న విషయం వైఎస్‌ జగన్‌కు తెలుసు. అందుకే జగన్‌ మాట చెబితే దానిని తప్పడు అని పేరు తెచ్చుకున్నారు.
► ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతానికి పైగా హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అమలు చేసి ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని వాటిని కూడా అమలు చేసిన ఘనత ఆయనదే. 
► ఆరోగ్యకరమైన కుటుంబం, భావితరాలు చిరునవ్వులు, ఆటపాటలతో సంతోషంగా ఉండేలా వైఎస్‌ జగన్‌ పాలన ఉండబోతోంది. ప్రజల సుందర స్వప్నానికి ఈ ఏడాదిలో గట్టి పునాది వేశారు. చరిత్రగతిని మారుస్తున్న ఆయనతో ప్రయాణిస్తున్న మాకు, పార్టీ కార్యకర్తలకు ఎంతో గర్వంగా ఉంది.

వైఎస్సార్‌కు నివాళి..
కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏడాది పాలన వేడుకలకు పరిమిత సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. వేడుకల ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, నారాయణమూర్తి, గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బసిరెడ్డి  సిద్ధారెడ్డి, పార్టీ యువజన రాష్ట్ర నేత కావటి మనోహర్‌నాయుడు, బీసీ సెల్‌ నేత పద్మారావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు