అలజడికి కుట్ర!

11 Apr, 2019 04:36 IST|Sakshi

పరాజయానికి సాకుల కోసం టీడీపీ డ్రామాలు: సజ్జల

బూత్‌ల వద్ద అల్లర్లకు ప్లాన్‌ కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలి

బాబుకు శాశ్వత రాజకీయ వీడ్కోలు పలకనున్న ఓటర్లు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల కమిషన్‌పై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలని, ఇలా ధిక్కారం ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్ధమని సజ్జల అభిప్రాయపడ్డారు. అసలు ఒక అభ్యర్థి నామినేషన్‌ వేసేటపుడే తాను ఎన్నికల నియమావళికి బద్ధుడనై,ఎన్నికల కమిషన్‌ ఆజ్ఞలకు లోబడి వ్యవహరిస్తానని ప్రమాణం చేస్తారని ఇపుడు చంద్రబాబు ఆ ప్రమాణాలను ఉల్లంఘించారన్నారు. చంద్రబాబును ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించాలని సజ్జల డిమాండ్‌ చేశారు.  

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో చివరి రోజు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  ‘పరాజయం తప్పదని తెలిసినా దింపుడు కళ్లెం ఆశతో ప్రజలను, ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేయడానికి, ఆఖరున ఎన్నోకొన్నయినా ఓట్లు రాలతాయన్న ఉద్దేశంతో పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌లలో అలజడి సృష్టించడానికి ఆయన కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీకి ఓటువేస్తే ఏదో జరగబోతోందని ప్రచారం చేసే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అడ్డదారుల్లో గొడవలు సృష్టించి, ప్రజల్లో భయం, ఆపోహ కలిగించడానికే బుధవారం ఎన్నికల కమిషన్‌ ఎదుటకూడా డ్రామా ఆడినట్లు కనిపిస్తోంది. పోలింగ్‌తేదీ రాష్ట్ర ప్రజలంతా రాజకీయంగా ఆయనకు శాశ్వతంగా వీడ్కోలు పలికే రోజని తేలిపోయంది. దాంతో ఏదో ఒకటి చేసి సానుభూతి పొందాలని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలగచేయాలన్న ఉద్దేశమే చంద్రబాబు హడావుడికి కారణంగా కనిపిస్తోందని’ ఓ ప్రకటనలో తెలిపారు. ‘పోలింగ్‌ రేపనగా సీఎం చంద్రబాబు చేసిన హడావుడి, సీఈవో దగ్గరకు వెళ్లి వైఎస్సార్‌సీపీమీద విపరీతమైన ఆరోపణలు చేయడం, తరువాత ఆయనను దబాయించి మాట్లాడటం, అనంతరం మీడియాలో మాట్లాడిన అంశాలు చూస్తే ఆయన వ్యవహారశైలి తీవ్రమైన నిరాశా, నిస్పృహలకు లోనైనట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. దానికంటేకూడా రేపు ఓటమిపాలైన తరువాత చెప్పడానికి ఓ సాకును సృష్టించడాని ఇదంతా చేస్తున్నట్లు కనపడుతోంది. గత ఐదేళ్లపాటు అన్నివర్గాలను మోసం చేసి, సామూహికంగా , వ్యక్తిగతంగా తమను బాధలకు గురిచేయడం ఐదు కోట్లమంది మర్చిపోలేరని’ ఆ ప్రకటనలో వివరించారు. 

వైఎస్‌ హుందాగా వ్యవహరించారు...
చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు అర్థరాత్రి ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి లేని పోని గొడవలను చేయించారని, 2009 ఎన్నికలకు ముందుగా ఆయన ఫిర్యాదుతో డీజీపీని మార్పించారని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించి ఎన్నికల కమిషన్‌ను గౌరవించారని సజ్జల గుర్తు చేశారు. భన్వర్‌లాల్‌ సీఈఓగా ఉన్నపుడు చంద్రబాబు చేసిన యాగీ ఆయన వక్రబుద్ధికి పరాకాష్ట అని అన్నారు. ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించడం కొత్తేమీ కాదని తమిళనాడులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గతంలో మార్చేశారని ఆయన గుర్తు చేశారు. 

వికటించిన చివరి తాయిలాలు...
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, ప్రజలందరినీ రాసి రంపానపెట్టి చంద్రబాబు ... ప్రజల కడుపు మాడ్చిన తరువాత చివరలో ఒక మెతుకు విసిరేసినట్లు తాయిలాలు ప్రకటించి, దానిద్వారా ఓట్లు సంపాదించాలని చేసిన ప్రయత్నంకూడా వికటించిందన్నారు. ఇక్కడ బాధితులు  ప్రజలే కాబట్టి... ఆయన ఆఖరు నిమిషంలో చేసిన ఈ ప్రయత్నం అప్పటికే బాధలో ఉన్నవారికి పుండుమీద కారం రాసినట్లయింది. చివర్లో పసుపు–కుంకుమ అన్నా, అన్నదాతా సుఖీభవా అన్నా, ఏపేరు చెప్పినా ఎవరూ నమ్మలేదు. రైతు రుణమాఫీ అని చెప్పి మొత్తంగా మోసం చేశారు. వడ్డీల రూపంలోనే రైతులు లక్షల రూపాయలు చెల్లించుకున్నాక, కుదించిన దాంట్లో  (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో) కూడా నాలుగు, ఐదో విడతలకు చెందిన రూ. 8,400 కోట్లు బ్యాంకుల్లో వేస్తున్నామని చెప్పి హడావుడి చేసినా రైతులపై ఎటువంటి ప్రభావమూ చూపలేదు.ఆయన మోసపూరిత ధోరణి అందరికీ అర్థమయింది. 

వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్లుగా జరుపుతున్న పోరాటాల ఫలితంగా, ఆయన 14 నెలలపాటు జరిపిన పాదయాత్రలో విపరీతమైన ప్రజాదరణ లభించిందన్నారు. ఒక ప్రత్యామ్యాయాన్ని ప్రజలు ఆయనలో చూసుకున్నారన్నారు.

కుట్రలకు, కుతంత్రాలకు–విశ్వసనీయతకు, విలువలకు మధ్య పోటీ...
‘చంద్రబాబు ఒక అరాచక శక్తిగా అతిపెద్ద దేశంలో అత్యంత అవినీతిపరుడిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదుకావాల్సిన వ్యక్తి. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబు ఒకపక్క ఉంటే...పార్టీ పెట్టినప్పటినుంచి 9 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేయడమే కాకుండా, 2014 తరువాత రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రత్యేక హోదాలాంటి అంశాల్లో కేంద్రంతో పోరాడుతూ, ఎంపీలతో రాజీనామాలు చేయించి, తానే ఆమరణ దీక్షకు కూర్చుని ఉద్యమాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకోసం నిలబడిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి మరోపక్క నిలిచారు. చంద్రబాబు కుట్రలను, కుతంత్రాలను అరాచకాలను ఒంటిచేత్తో ఎదుర్కొని పార్టీని ముందుకు నడుపుతూ విశ్వసనీయతకూ, విలువలకు మారుపేరుగా వైఎస్‌ జగన్‌గారు నిబడ్డారు.  ప్రజలు వేయబోయే ఓటు ఒకపక్క టీడీపీని భూస్థాపితం చేయాలనే బలమైన ఆకాంక్షతోనూ. మరోవైపు రాష్ట్రానికి బంగారు భవిష్యత్తునిచ్చే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన వైఎస్సాసీపీకి ఓట్లేయాలన్న స్థిరసంకల్పంతోనూ ఉన్నట్లు స్పష్టమవుతోంద’ని సజ్జల అన్నారు. 

సంయమనం పాటించాలి...
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టంకట్టడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నారని,  దాన్ని గ్రహించే చంద్రబాబు రెచ్చగొట్టే పనులకు పాల్పడుతున్నారని సజ్జల ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఙప్తి చేశారు. ‘మనం గెలుస్తున్నాం. ఓటింగ్‌ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వాళ్లు రెచ్చగొట్టినా రెచ్పిపోవద్దు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిబ్బరంగా సర్దుకుపోవడయే వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల వ్యవహారశైలి. 14 నెలల పాదయాత్రలో కోట్లాదిమంది ప్రజలను కలిసినా, పెద్ద ఎత్తున జనం తరలివచ్చినా ఒక్క చిన్న అవాంచనీయ సంఘటనకూడా జరగక పోవడమే వైఎస్సార్‌సీపీ శాంతి, సంయమనాలకు నిదర్శనమని’ అన్నారు.

మరిన్ని వార్తలు