దౌర్జన్యం చేసి నిందలా?

12 Apr, 2019 04:20 IST|Sakshi

చంద్రబాబు బాధంతా ఓడిపోతున్నాననే 

పోలింగ్‌ రోజు దౌర్జన్యకాండకు దిగింది చాలక ప్రత్యర్థులపై నిందలా?

ఈవీఎంలు పనిచేయడం లేదంటూ చంద్రబాబు దుష్ప్రచారం

పోలింగ్‌ నాడు టీడీపీది దౌర్జన్యం.. వైఎస్సార్‌సీపీది సంయమనం

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : పోలింగ్‌ రోజున తీవ్రస్థాయిలో దౌర్జన్యాలు చేసింది కాక ఆ నిందలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షంపై వేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పోలింగ్‌ రోజున ఉదయం నుంచీ చంద్రబాబు చేస్తున్న వక్ర విన్యాసాలు, అబద్ధపు ప్రచారాలపై సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశాంతంగా పోలింగ్‌ జరగాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తొలి నుంచీ భావించిందని, ఆ ప్రకారమే ఉదయం నుంచీ ఓటర్లు తమ హక్కును పెద్దఎత్తున వినియోగించుకున్నారన్నారు. ఇది ఏపీలో మార్పునకు ఒక సంకేతమన్నారు. గత ఎన్నికల మాదిరిగా తన పప్పులు ఉడకవేమోననే ఆందోళనతో చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు, విశ్వసనీయత, సేవాభావం అనేవి వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయన్నారు. 

నాడు అబద్ధాలతో అధికారంలోకి..
2014లో చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేసి, అబద్ధపు హామీలిచ్చి చివరి నిమిషంలో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని.. కానీ, ఈసారి ఆయన పప్పులుడకవని సజ్జల అన్నారు. ప్రజల కోసం నాలుగు మంచి పనుల గురించి ఆలోచించకుండా కుట్రలు, కుతంత్రాల ద్వారా ఓటర్లను ఎలా లొంగదీసుకోవాలి, వారిని ఎలా ఏమార్చాలి, ప్రతిపక్షాన్ని లేకుండా ఎలా చేయాలన్న విషయాలకే ప్రాధాన్యతిచ్చారని ఆయన మండిపడ్డారు. దీని ఫలితంగానే చంద్రబాబు ఘోరంగా దెబ్బతిన్నారని.. ఎన్నికలు దగ్గర పడగానే మరిన్ని తప్పులు చేశారన్నారు. ఈసారి తన పప్పులు ఉడకలేదు కాబట్టే బుధవారం నుంచీ చంద్రబాబు బాడీ లాంగ్వేజీలో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే చంద్రబాబు హుందాగా ప్రవర్తించకుండా మరో డ్రామాకు తెరలేపారన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. ఎన్నికలప్పుడు డీజీపీని మార్చాలని డిమాండ్‌ చేస్తే ఎన్నికల కమిషన్‌ మార్చిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాక.. నాటి సీఈఓ భన్వర్‌లాల్‌ను అర్థరాత్రి ఘెరావ్‌ చేసింది కూడా ఆయనేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటే ప్రజల సానుభూతిని పొందేందుకు చిన్న సంఘటనలను కూడా సాకుగా చూపి ఆక్రోశం వెళ్లగక్కే స్థాయికి బాబు దిగజారారని విమర్శించారు.

ఓటమి తప్పదనే బాబు సాకులు
ఇదిలా ఉంటే.. చంద్రబాబు తనకు ఓటమి తప్పదని నిర్థారణకు వచ్చినట్లున్నారని అందుకే ఆయన సాకులు వెతుకుతున్నారని సజ్జల అన్నారు. ఎక్కడో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తే, దాన్ని పట్టుకుని 30 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారం చేశారన్నారు. క్షమించరాని విధంగా ఈవీఎంలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ప్రజలు మార్పును కోరుతున్న విషయం ఆయనకు బోధపడిందని.. ప్రజాభిప్రాయం ఉవ్వెత్తున ఎగసిపడుతోందనే బాధతో ఆయన ఉన్నారన్నారు. అందుకే తన కౌటిల్యం, కుట్రలు, కుతంత్రాలు, ట్రిక్కులు పనిచేయలేదని బాధపడుతూ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. 

గొడవలు చేసి గగ్గోలు పెట్టారు
చంద్రబాబు చుట్టూ ఉన్నది ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడే ఏబీ వెంకటేశ్వరరావు, ఈవీఎంలు అపహరించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి హరిప్రసాద్, హ్యాకర్లు మాత్రమేనన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెంటాడి కొట్టారని, తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో వైఎస్సార్‌సీపీ నేత పుల్లారెడ్డిని వేట కొడవళ్లతో నరికారన్నారు. కావలిలో మరో దౌర్జన్యకర సంఘటన చోటు చేసుకుందన్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్యను పోలింగ్‌ కేంద్రం నుంచి పంపేశారని, నర్సారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ వారు దౌర్జన్యం చేశారన్నారు. టీడీపీ నేతలు తమకు తామే గొడవలు చేసి ఆ తరువాత ఎదుటి వారిపై గగ్గోలు పెట్టారన్నారు. ఇక చివరి ప్రయత్నంగా పలుచోట్ల రీపోలింగ్‌కు, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కూడా రీపోలింగ్‌ కోరే అవకాశం ఉందన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం, స్పీకర్‌
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఘోరంగా విఫలమయ్యారని సజ్జల ఆరోపించారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారన్నారు. పోలింగ్‌ జరుగుతుండగా బుధవారం కోడెల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారని.. బయటకు వచ్చాక లోపల దౌర్జన్యం చేశారని ఆరోపించారన్నారు. బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంటు ఒక్కరే ఉన్నప్పుడు ఆయనపై ఎవరు దౌర్జన్యం చేస్తారని సజ్జల సూటిగా ప్రశ్నించారు. ఒక పార్టీ సాధారణ కార్యకర్త ఆయనపై దౌర్జన్యం చేస్తారా? ఒక వేళ పోలీసులు దౌర్జన్యం చేసి ఉంటే వారు టీడీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వారే కదా అన్నారు. కోడెల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇదంతా సానుభూతి కోసం ఆడిన డ్రామా అని ఆయనన్నారు. ఈవీఎంలో టీడీపీ బటన్‌ నొక్కితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఓటు పడుతోందని చంద్రబాబు ఆరోపించారని, మరి ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గుర్తు మీద నొక్కమని పిలుపు ఇవ్వచ్చు కదా అని సజ్జల ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు