ఎల్‌జీకి అనుమతులు టీడీపీ నిర్వాకమే

12 May, 2020 04:53 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

2018లో అనుమతులు ఇచ్చింది చంద్రబాబు సర్కారే

సింహాచలం భూములు ఆ కంపెనీకి కట్టబెట్టిందీ బాబే

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో సేద తీరుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు అలవాటైన రీతిలో దగాకోరు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు( ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విశాఖలో జరిగిన ప్రమాదంపై రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే..

7 ఏళ్ల పాటు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు
ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ విస్తరణ, ఉత్పత్తి ప్రారంభించడానికి 2018లో చంద్రబాబు సర్కారే అనుమతులు ఇచ్చింది. కంపెనీ విస్తరణ కోసం కన్సెంట్‌ ఆఫ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఎల్‌జీ పాలిమర్స్‌ 2018, నవంబర్‌ 29న దరఖాస్తు చేయగా అదే ఏడాది డిసెంబర్‌ 7న తనిఖీలు నిర్వహించారు. 2018 డిసెంబర్‌ 21న కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో మొక్కుబడిగా చర్చించి డిసెంబర్‌ 27నే అనుమతులు జారీ చేసేశారు. 
► ఏకంగా ఏడేళ్లపాటు అనుమతులు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2018, డిసెంబర్‌ 27న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లేకుండానే  టీడీపీ ప్రభుత్వమే అనుమతులిచ్చేసింది. దీంతోనే ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. ఇవన్నీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల్లో ఉన్న వాస్తవాలే. 

సింహాచలం భూములు కట్టబెట్టిన బాబు
► సింహాచలం దేవస్థానానికి చెందిన 162 ఎకరాలను ఎల్‌జీ పాలిమర్స్‌కు కట్టబెడుతూ 2015లో చంద్రబాబు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. ఆమేరకు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా డీ నోటిఫై చేస్తూ 2015 ఆగస్టు 17న టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తాము ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఆ భూములకు సంబంధించి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పింది. ఆ  సాకుతో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆ భూములను ఎల్‌జీ పాలిమర్స్‌కు కట్టబెట్టేసింది.
► సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి వేలాది మంది సామాన్యులకు ప్రయోజనం కల్పించేలా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తానని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. ఎల్‌జీ పాలిమర్స్‌కు మాత్రం ఆగమేఘాల మీద 162 ఎకరాలను ధారాదత్తం చేశారు. 

మరిన్ని వార్తలు