'మ‌తిమ‌రుపు జ‌నానికి కాదు.. బాబుకు'

2 Jul, 2020 19:36 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు చెప్పిన అబద్ధాలనే పదేపదే చెబుతున్నారని విమ‌ర్శించారు. మతిమరుపు జనానికి కాదని.. చంద్రబాబుకేన‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క‌నీసం ఆయన కొడుకు అయినా జాగ్రత్త పడాలని హిత‌వు ప‌లికారు. గురువారం ఆయ‌న తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నిబద్ధత, విశ్వసనీయత కలిగిన నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికే ప్రజలు పట్టం క‌ట్టార‌న్నారు. అందరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్‌దని కొనియాడారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో హామీలన్నింటినీ నెరవేర్చామ‌ని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ పేదల కోసం 28వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖర్చు చేశామ‌న్నారు. (పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి)

‌టీడీపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు
"తాజాగా 1088 అత్యాధునిక 104, 108 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఈ వాహ‌నాలకు 200 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేస్తే 307 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. 108, 104 సిబ్బందికి టీడీపీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో 1800 అంబులెన్స్‌లు ఎక్కడ పెట్టారో చెప్పాలి? ఆయ‌న పెట్టిన పెండింగ్‌ బకాయిలన్నీ మేమే చెల్లించాం. దొంగ దీక్షలు చేస్తూ రూ.వేల కోట్లు నొక్కేసింది చంద్రబాబు కాదా? అచ్చెన్నాయుడు కేసులో టీడీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. అచ్చెన్నాయుడిని విచారణకు తీసుకెళ్తే కులం రంగు పులుముతున్నారు" అని స‌జ్జ‌ల‌ మండిప‌డ్డారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?)

మీలాగా చంద్రన్న మరుగుదొడ్లు పేర్లు పెట్టలేదు
"సీఎం జగ‌న్ నిరంతరం ప్రజల్లో ఉన్నారు. ఒక గొట్టం ఛానెల్‌లో వైస్సార్ పేరుతో పథకాలు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజా నాయకుడు. అందుకే పథకాలకు ఆయ‌న‌ పేరు పెట్టాము. మీలాగా చంద్రన్న మరుగుదొడ్లు పేర్లు పెట్టలేదు. మొదటి నుంచి మేము పార్టీతోనే ఉన్నాము. మాతో పాటు చాలా మంది పార్టీ కోసం పని చేస్తున్నారు. మాకు పవర్ ఏమి ఇవ్వలేదు, కార్యకర్తలతో సమన్వయం కోసమే మా ముగ్గురికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు? కీలకమైన రెండు మంత్రి పదవులు  చంద్రబాబు.. లోకేష్‌కు ఎందుకు కట్టబెట్టారు?" అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. (పథకాలను ప్రజలకు అందించడం ప్రజా ప్రతినిధుల విధి)

మరిన్ని వార్తలు