‘అవకాశం ఇస్తే ఆరు నెలల్లో శంకుస్థాపన’

26 Jun, 2018 17:35 IST|Sakshi
జమ్మలమడుగులో నిర్వహించిన ఉక్కు సంకల్ప దీక్షలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి. చిత్రంలో అవినాష్‌రెడ్డి, సురేశ్‌బాబు, రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, అమర్‌నాథరెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు

గసాక్షి ప్రతినిధి, కడప/జమ్మలమడుగు: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన రెండేళ్లలో ఉత్పత్తి కూడా మొదలయ్యేలా కృషి చేస్తామని వారు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు ఉక్కు సంకల్పదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీతో కేంద్రంలో నాలుగేళ్లు అధికారం పంచుకున్న చంద్రబాబు విభజన హామీల అమలుకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని, పదవిపై వ్యామోహమే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న యావ ఉండదని వారు దుయ్యబట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.

ప్రత్యేకించి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జమ్మలమడుగు సమీపంలో 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయగా దాదాపు రూ.1,300 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయన్నారు. దేశంలో అత్యధికంగా స్టీల్‌ ఉత్పత్తి చేసే జిందాల్‌ పరిశ్రమకు దీటుగా ఉండాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బ్రహ్మణీని రూపొందించారన్నారు. ఆయనే బతికి ఉంటే నేడు జమ్మలమడుగు రూపురేఖలు పూర్తిగా మారిపోయేవని వివరించారు. బ్రహ్మణీ స్టీల్స్‌ పూర్తి అయి ఉంటే ఇప్పటికే కోటి టన్నుల సామర్థ్యం కలిగిన పరిశ్రమగా ఉండేదన్నారు. వైఎస్‌ మరణానంతరం చంద్రబాబు కుటిల రాజకీయాల కారణంగా పరిశ్రమ పూర్తికాలేదన్నారు.  

ఆయన జీవితమే కుట్రలమయం 
టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమే కుట్రలమయం.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యంలేక ప్రతిసారి ఏదో ఒక పార్టీ సహకారంతో గెలిచారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడైనా నిజాయితీగా మాట్లాడారా.... చిత్తశుద్ధితో ప్రజలకేమైనా మేలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిత్వం పరిశీలిస్తే అవలక్షణాలున్న విలనే కన్పిస్తాడని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం పరిశీలిస్తే అసలుసిసలు హీరో కన్పిస్తారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ సమయం పూర్తి అవుతోండగా, ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచడంతోపాటు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మించినా అడ్డుకోలేకపోయారని ఆరోపించారు.

భవిష్యత్‌ తరాలకు ప్రశ్నార్థకంగా కానున్న ఆ ప్రాజెక్టులను కర్ణాటక నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే తపన వైఎస్‌లో మెండుగా ఉండేదని, అందుకే ముఫ్‌పైఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం తీసుకున్నారని తెలిపారు. మీ ముంగిట గండికోట ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నాయంటే అదీ వైఎస్సార్‌ పుణ్యమేనని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రాగానే  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆరునెలల్లోనే శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తామని హమీ ఇచ్చారు. 

రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ దీక్షలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి 
విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని ఏనాడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపైనే ఒత్తిడి తీసుకురాలేదని తాజా మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్‌లోనే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి అనుకూలంగా లేదని తేల్చిచెప్పినా, మూడున్నరేళ్లుగా తెలుగుదేశం నాయకులు, సీఎం స్పందించలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుండటంతో రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షల పేరుతో  నాటకం ఆడుతున్నారన్నారు. అదే సమయంలో విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. 2014లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించామన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం చెబుతోందన్నారు. దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

విభజన హామీలు అమలు చేయని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము పదవులకు రాజీనామా చేశామన్నారు. టీడీపీ నాయకుల మాదిరి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం మోసపూరిత పోరాటాలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము 14నెలల ముందే ఎంపీ పదవీకి రాజీనామాలు చేశామన్నారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో టీడీపీకి, బీజేపీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్‌ రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జమ్మలమడుగు, కమలాపురం సమన్వయకర్తలు సుధీర్‌రెడ్డి,  మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి.శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీపి.సుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు