అవే అబద్ధాలు మళ్లీ మళ్లీ

3 Jul, 2020 05:19 IST|Sakshi

అయోమయం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యం

తన చాదస్తంతో అభాసుపాలవుతున్నారు

వైఎస్‌ పేరును పథకాలకు పెట్టినందుకు గర్వపడుతున్నాం

కరోనా సమయంలో సైతం సీఎం రూ.28 వేల కోట్లు ఇచ్చారు

మీరు చెబుతున్న 1,800 వాహనాలేవీ?

వంద జన్మలెత్తినా టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు

సరస్వతి పవర్‌ ప్రాజెక్టుకు లీజు పొడిగింపు సరైనదే 

సాక్షి, అమరావతి: జూమ్‌ కాన్ఫరెన్స్‌లలో టీడీపీ అధినేత చంద్రబాబు కన్నార్పకుండా చెప్పిన అబద్ధాలే మళ్లీ చెబుతూ ప్రజల్లో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబెల్స్‌ మాదిరిగా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తూ.. చాదస్తపు మాటలతో ప్రజల్లో అభాసుపాలవుతున్నారన్నారు. తాడేపల్లిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఊహల్లోంచి బాబు బయటకు రావాలి
► ఏడాది క్రితం వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల పట్ల తను ఎలా వ్యవహరించారో మరచిపోయారు. కానీ ప్రజలు మరచిపోలేదు. ఆయన ఇప్పటికైనా ఊహల్లో నుంచి బయటకు రావాలి. 
► వైఎస్సార్‌సీపీని స్థాపించిన నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజా సమస్యలే అజెండాగా అనేక పోరాటాలు, దీక్షలు చేసినందునే ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తించాలి.  
► సీఎం జగన్‌ ప్రజలకు తాను ఏం చెప్పారో అవి చేసుకుంటూ పోతూ రికార్డులు సృష్టిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలమైన ఓ ఎల్లో మీడియా చానెల్‌.. వైఎస్సార్‌ పేర్లతో ఉన్న పథకాలపై కథనాన్ని ప్రసారం చేస్తూ గుక్క తిప్పుకోకుండా వైఎస్సార్‌ పేరును చదివింది.
► ప్రజలకు సమర్థవంతమైన, సంక్షేమ పాలనను అందించిన నాయకుడుగా వైఎస్సార్‌ మాకు స్ఫూర్తి ప్రదాత. పథకాలకు ఆయన పేరు పెడుతున్నందుకు గర్విస్తున్నాం. చంద్రబాబుకు కడుపు మంట ఎందుకు? 

రూ.28 వేల కోట్లు ఇవ్వడం అవాస్తవమా?
► ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేయడమే కాకుండా, గత ఐదారు నెలల్లోనే కరోనా సంక్షోభ సమయంలో కూడా వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.28 వేల కోట్లకు పైగా నగదు బదిలీ చేశాం. ఇది అవాస్తవం అని చంద్రబాబు చెప్పగలరా? 
► అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలతో కూడిన 108, 104 వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తే ఇందులో రూ.300 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తారా? గతంలో ఈ సర్వీసుల సిబ్బందికి మీరిచ్చిన జీతాలు ఎంత? ఇప్పుడు మేం ప్రకటించింది ఎంత?  

ఆ 1800 వాహనాలు ఎక్కడున్నాయి?
► చంద్రబాబు చెప్పినట్లు తన హయాంలో 1800 వాహనాలు 108 కోసం ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా దాచి పెట్టారా? లేక ట్రావెల్స్‌కు ఏమైనా ఇచ్చారా? ఆడిట్‌ చేయిద్దాం. ఆ వాహనాలు పెద్ద సంఖ్యలో పాడై పోయి మూలన పడి ఉండటాన్ని అప్పట్లో చూశాం. 
► చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను చెల్లించాం. గ్రామ సచివాలయాల రంగులకు జగన్‌ ప్రభుత్వం రూ.1,300 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు రాజకీయం చేస్తూ విమర్శిస్తున్నారు. వాస్తవానికి రంగుల కోసం ఖర్చు చేసింది రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఉండొచ్చు. మేం ఇలాంటి చిల్లర విషయాలను ఎప్పుడూ పట్టించుకోలేదు.

నిబంధనల మేరకు సరస్వతి లీజు పొడిగింపు
► సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌కు లీజుల పొడిగింపు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరిగింది. చంద్రబాబు ఆరోపణలు అర్థరహితం. అప్పటి ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో లీజులు రద్దు చేసింది.  ఈ రోజు తిరిగి వాటిని పునరుద్దరించడం, 30 నుంచి 50 ఏళ్లకు లీజు గడువు పెంచడం పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరిగింది. 
► అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతి అక్రమాల వల్ల అరెస్టు అయితే రాజకీయ కక్ష అని చంద్రబాబు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు, లోకేష్‌లు ఇదే తీరుగా వ్యవహరిస్తే వంద జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి మాత్రం రాలేరు.  
► బిజీగా ఉన్న సీఎం పార్టీ వ్యవహారాల సమన్వయం కోసం మాకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే.. దానిపై కూడా విమర్శలు చేయడం తగదు. ఇవి అధికారయుతమైన పదవులు కాదు.

మరిన్ని వార్తలు