‘ఆ ఖర్చుతో రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’

26 Feb, 2020 14:54 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం గత అయిదేళ్ల పాలనలో జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్లలో వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు.రూ. 90 వేల కోట్ల అప్పుతో ప్రారంభమైన రాష్ట్రం.. మూడు లక్షల కోట్ల అప్పుకు చేరుకుందన్నారు. దోచి పెట్టడానికే గత ప్రభుత్వంలో కేబినెట్‌ సమావేశాలు జరిగేవని, టీడీపీ హయాంలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అన్నారు. సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకే వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, అధికారం చేపట్టిన రోజు నుంచే సీఎం జగన్‌ ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టాడని ప్రశంసించారు. 

చట్టం తన పని తాను చేసుకుపోతుంది
ప్రజా సంక్షేమానికి టీడీపీ అడ్డుపడుతోందని, చంద్రబాబు ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు. అవినీతితో రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులుతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడటం తగ్గించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం తీసుకొచ్చారన్నారు. రాజదానికి లక్ష కోట్లు పైనే ఖర్చు అవుతుందని సీఎం జగన్‌కు ముందే  తెలిస్తే ఎన్నికలప్పుడే తాను అంత ఖర్చు చేయాలేనని చెప్పేవారని పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ కట్టలేనని తెలిసే చంద్రబాబు ఇల్లు అమరావతిలో కట్టుకోలేదని, అమరావతితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. అమరావతి  విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

వైజాగ్ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, అందుకే  అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు. రాజధాని మొత్తం అమరావతి నుంచి తొలగించడం లేదని, ఒక భాగాన్ని వైజాగ్ కు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకుని వెళ్తున్నారని గుర్తు చేశారు. అమరావతి సౌకర్య వంతమైన నివాస యోగ్యం కాదని, అందుకే ఉద్యోగులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేదని అన్నారు. అమరావతికి అప్పు చేసి ఖర్చు చేసే ధనంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు.  రాజధానిలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు చంద్రబాబును నమ్మలేదని, అందుకే అక్కడ బాబు కుమారుడుని  ఓడించారని అన్నారు. సీఎం జగన్‌ రాజదానిని తన ఊరు తీసుకుపోవడం లేదని, మూడు రాజధానులు వ్యతిరేకించిన వారే ఒక ఏడాది తరువాత స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు. రాజదానిపై చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలు వారిగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల ఉపయోగాన్ని వివరించాలని సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా