‘చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టు పక్షులుగా మారారు’

1 Jun, 2020 18:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తన కుయుక్తులతో ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఓడిపోయిన నెల రోజుల నుంచే టీడీపీ కుట్రలు మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అధికారం పోయిందన్న బాధ ఉందని మండిపడ్డారు. చరిత్రహీనుడిగా మిగిలిన చంద్రబాబు కుట్రలు మానలేదని ఎద్దేవా చేశారు. కావాలనే చిన్నా చితకా కేసులు వేసి ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతగల ప్రతిపక్షమైతే ఎందుకు ఓడిపోయామనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలకు తెరలేపారని అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని తెలిపారు. ఏడాదిలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వవ ఏడాది పాలనలో 3.58 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  (టీడీపీకి ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే)

చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టు పక్షులుగా మారారని, టీడీపీది లిటిగెంట్ స్వభావం ఉన్న పార్టీ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో కెబినెట్ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం, బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు ఆదా చేశామని, ఇది కన్నా లక్ష్మీనారాయణకు కన్పించదా అని సూటిగా ప్రశ్నించారు. అక్రమాలను వెలికి తీశామని, దోషులను బయటపెడతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులను బయటపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుందని తెలిపారు. ఏడాది పాలనలో జగన్ సృష్టించిన రికార్డులని మరుగున పర్చేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో పెడుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏయే అంశాల్లో వేస్తున్నారో చూస్తే అర్ధం అవుతోందన్నారు. రోడ్డు మీద తాగి ప్రభుత్వాధినేతను తిడుతోంటే కోర్టులో కేసులు వేస్తారని, ఆ కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారని మండిపడ్డారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో అందరికి తెలుసన్నారు. ఏడు రంగుల్లో ఏదో రంగు వేయాలి, దీనిపైనా కోర్టుకు వెళ్తామని తెలిపారు. (మూణ్నెళ్ల అనంతరం ఈసీ ప్రత్యక్ష భేటీ)

ప్రభుత్వ భూములను పేదలకు ఇస్తున్నా పిటిషన్లు వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబాట్టారు. స్థానిక ఎన్నికల నిర్వహాణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిమ్మగడ్డ రమేష్‌.. వాయిదా వేసేటప్పుడు ఎందుకు సంప్రదించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రాసిన లేఖలో సీఎం జగన్‌ ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా ఎందుకు రాయాల్సి వచ్చిందని నిలదీశారు. ఏజీ మాట్లాడితే నిమ్మగడ్డ కంటే ముందుగా యనమల స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీడీపీ ఈ ఎన్నికలను జరగనివ్వదల్చుకోలేదని మండిపడ్డారు. కోర్టు అంటే తమకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. తాము ఎప్పుడూ కోర్టులపైన కామెంట్ చేయలేదని గుర్తు చేశారు. కోర్టుల్లో జరుగుతోన్న పరిణామాల విషయంలో మాత్రం బాధ కలుగుతోందన్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల విషయంలో కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకెళ్లే వెసులుబాటు పొందే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామంటే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు