అవధులు దాటిన వంచన

15 Sep, 2018 00:59 IST|Sakshi
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

ముప్పు ముంచుకొచ్చినప్పుడల్లా జనాన్ని పక్కదోవ పట్టించడంలో సిద్ధహస్తుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హడావుడి మొదలెట్టారు. రొటీన్‌గా న్యాయ స్థానం నుంచి అందిన వారెంట్‌ను ఆసరా చేసుకుని భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు. తన చతురంగ బలగాలను రంగంలోకి దించి కుట్ర కోణాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏలేరు కుంభకోణం మొదలుకొని నిన్న మొన్నటి ‘ఓటుకు కోట్లు’ వరకూ బడా బడా కేసుల్లో సైతం సునాయాసంగా స్టేలు తెచ్చుకోగలిగిన బాబు... ఈ పిపీలకాన్ని మాత్రం విస్మరించారని అనుకోవటం తెలివితక్కువ తనమే. దానిలోని ఆంతర్యమేమిటో ఇప్పుడు సాగుతున్న హడావుడి గమనిస్తే సులభంగానే బోధ పడుతుంది. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేసేవారిపై నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న పేరిట కేసులు పెట్టడం, అరెస్టు చేయడం ప్రభుత్వాలకు రివాజు. గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సర్కారు విపక్షాలనూ, ప్రజాసంఘాలనూ ఇలాంటి కేసులతోనే వేధిస్తోంది. ఆఖరికి ఇటీవల తన సభలో మౌనంగా ప్లకార్డులు పట్టుకున్నందుకు ఏ పార్టీకీ చెందని ముస్లిం యువకులను సైతం బాబు సర్కారు ఇలాగే అరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా, శారీరకంగా హింసించింది.

ఇంతకూ ఇప్పుడు బాబుకు న్యాయస్థానం నుంచి వచ్చిన నోటీసు పూర్వాపరాలేమిటి? చంద్ర బాబు, ఆయన పార్టీ నేతలు ఎనిమిదేళ్లక్రితం, అంటే 2010లో బాబ్లీ ప్రాజెక్టును నిరసిస్తూ ఆందో ళన చేసేందుకు వెళ్లినప్పుడు మహారాష్ట్ర పోలీసులు ధర్మాబాద్‌ వద్ద వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు. ఆ కేసుల విచారణ ధర్మాబాద్‌ సివిల్‌ జడ్జి కోర్టులో మూడేళ్లక్రితం మొదలైంది. అప్పటి నుంచి వేర్వేరు సందర్భాల్లో 22 సార్లు ఆ కేసు విచారణకొచ్చింది. అలా విచారణ జరిగిన ప్రతిసారీ కేసులోని ముద్దాయిలందరికీ నోటీసులు వెళ్తాయి. ఆ నోటీసులకు అనుగుణంగా కోర్టు ముందు హాజరై తమ వాదన వినిపించకపోతే, విచారణకు సహకరించకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అవుతుంది.

జంగా మహారాష్ట్రలో తాము తప్పుచేయలేదనుకున్నప్పుడు 22 సార్లు కోర్టు నుంచి వచ్చిన నోటీసులకు బాబు ఎందుకు స్పందించలేదు? వాస్తవానికి ఇలాంటి చిన్న కేసుల్లో ముద్దాయిలు వెళ్లనవసరం లేదు. తమ న్యాయవాది ద్వారా వాదన వినిపించవచ్చు. ఈ మార్గాన్ని వదిలి ఇప్పుడు నానా యాగీ చేయడంలో బాబు ఉద్దేశం సుస్పష్టమే. ఆంధ్రప్రదేశ్‌లో తన కథ ముగింపుకొచ్చిందని ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి ఓటమి తప్పదని దాదాపు సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అందుకే ‘జరుగుబాటు’ సిద్ధాంతాన్ని నమ్ముకుని చివరి వరకూ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.

పొరుగునున్న తెలం గాణలో మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోంది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాను అడ్డంగా దొరికాక అక్కడ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకో వడం వల్ల వీసమెత్తు ఉపయోగం కూడా లేదని బాబుకు ఎప్పుడో తెలిసిపోయింది. ఈ ముందస్తు ఎన్నికల్లో పార్టీకి సంభవించబోయే ఓటమి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కి పడిపోతామన్న భీతి ఆయన్ను వేధిస్తోంది. ఒక్క నోటీసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లబ్ధి పొందడమే లక్ష్యంగా రెండునెలల తర్వాత ఇప్పుడు కోర్టు వారెం ట్‌ను బయటకు తవ్వి తీసి ‘కుట్ర’ కథకు తెరలేపారు.

బాబ్లీ వ్యవహారాన్ని తెలంగాణ వాసులకు గుర్తు చేసి వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతో పోరాడానని చెప్పుకోవటం బాబు ఆంతర్యం. వాస్తవానికి  తెలంగాణ ప్రాంతంలోని లక్ష లాది ఎకరాలను బీడు చేసే ప్రమాదమున్న ఆ ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు మొద లైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2001లో తాత్కాలిక డిజైన్‌ తయారైంది. మరికొన్నాళ్లకు అంచనా వ్యయాన్ని సవరించారు. టెండర్లు పిలిచారు. ఆ రోజుల్లో ఎప్పుడూ బాబ్లీ ప్రాజెక్టుపై ఆయన నోరెత్తింది లేదు. ఒక్క బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కాదు... మహారాష్ట్ర తలపెట్టిన ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన మౌనమే పాటించారు.

కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినప్పుడూ, కృష్ణానదిపై ఇతర ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పుడూ ఆయన వైఖరి డిటోయే. అదే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశానని చెప్పుకోవడానికి ఈ వారెంట్‌ సాకుతో పెడబొబ్బలు పెడుతున్నారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని అనుచరగణంతో ఆరోపణలు చేయి స్తున్నారు. ఒకపక్క ‘ఆపరేషన్‌ గరుడ’ అంటూ ఒక నటుడితో కథ చెప్పిస్తూ, దానికి అనుగుణంగా సహచర మంత్రులతో ఇష్టానుసారం మాట్లాడిస్తున్న ప్రభుత్వాధినేతకు తనకు వ్యతిరేకంగా ఒక కోర్టు నుంచి వారెంట్‌ జారీ అయిందని రెండు నెలల తర్వాతగానీ తెలియలేదంటే ఎవరూ నమ్మరు. మహారాష్ట్రతో బాబుకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి సీబీఐలో ఉండి బాబు ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని చెప్పాక కూడా మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీ మణికి బాబు టీటీడీ బోర్డు సభ్యత్వమిచ్చారు.

నిజానికి బాబుపై తెలంగాణలో విచారణ ప్రారంభం కావలసిన ‘ఓటుకు కోట్లు’ కేసు ఇప్పటికీ ఫైళ్లలో పడి మూలుగుతోంది. బాబు సర్కారు వేలాది కోట్ల అవినీతికి పాల్పడుతున్నదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మొదలుకొని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు గత నాలుగున్నరేళ్లుగా ఆరోపిస్తున్నాయి. వాటిపై ఇంతవరకూ కేసులే లేవు. కానీ ఈ చిన్న వారెంట్‌ పట్టుకుని రెండురోజులుగా బాబు అను చరగణం, ఆయన అనుకూల మీడియా హడావుడి చేస్తున్న తీరు ఔరా అనిపిస్తుంది. ఈ మాదిరి ప్రచారాలకు కాలం చెల్లిందని వారు గ్రహించటం ఉత్తమం.

>
మరిన్ని వార్తలు