జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ ఎంపీ

5 Jun, 2019 18:42 IST|Sakshi

లక్నో : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన సాక్షి మహరాజ్‌.. జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను పరామర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటన కేసులో సెంగార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతాపూర్‌ జైలులో ఉన్న సెంగార్‌ను కలిసిన సాక్షి మహరాజు కాసేపు అక్కడే గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి సెంగార్‌ జైల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు సెంగార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాన’ని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాక్షి మహరాజు ఉన్నావ్‌లోని సెంగార్‌ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

కాగా, సెంగార్‌ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్‌ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్‌ అరెస్ట్‌ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా