బాబు సర్కారు..మునిగిపోతున్న నావ

5 Apr, 2019 08:05 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఏపీ విఠల్‌ ప్రజల డాక్టర్‌. చాలాకాలం పాటు ప్రజా వైద్యశాల నిర్వహించారు. హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే ఎర్రజెండా పట్టుకున్న ఆయన.. ప్రజల నాడి తెలిసిన  సామాజిక శాస్త్రవేత్త. సమసమాజ నిర్మాణానికి చేయాల్సిన చికిత్స ఏమిటో తెలిసిన డాక్టర్‌ ఆయన. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సూచన మేరకు.. వైద్య వృత్తిని వదిలిపెట్టి సీపీఐ (ఎం) పూర్తి సమయ కార్యకర్తగా పార్టీ కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

అంతకు ముందు.. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర తొలి కన్వీనర్‌గా, డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) తొలి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి ప్రథమ అధ్యక్షునిగా, పౌర హక్కుల సంఘం  ఏపీసీఎల్‌ఏకు మొదటి కార్యదర్శిగా,  సీపీఎం రాష్ట్ర తొలి కార్యదర్శివర్గంలో సభ్యుడిగా.. మార్క్సిస్టు పార్టీతో సుదీర్ఘ అనుభవం ఆయనది. విజయవాడ ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో చిన్న ఇంట్లో నిరాడంబర జీవితం గడుపుతున్న డాక్టర్‌ ఏపీ విఠల్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు.

‘సామాజిక అన్యాయానికి’ ఈ ప్రభుత్వం ప్రతీక 
చంద్రబాబుది కేవలం దోపిడీ, దుర్మార్గాలు చేసిన ప్రభుత్వమే కాదు. ఈ ప్రభుత్వాన్ని కేవలం ఆర్థిక దోపిడీ చేసిన ప్రభుత్వంగా మాత్రమే చూడకూడదు. సమాజంలోని అన్నివర్గాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం. దళితులు మొదలు మహిళల వరకూ.. పేదల నుంచి మైనార్టీల వరకు.. వెనకబడిన కులాల నుంచి సాధారణ ప్రజల వరకు.. అందరికీ అన్యాయం చేసిన ప్రభుత్వం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వమిది. ‘సామాజిక అన్యాయానికి’ చంద్రబాబు ప్రభుత్వం ప్రతీక. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం తక్షణ కర్తవ్యంగా కమ్యూనిస్టులు, ప్రజల బాగు కోరే ప్రతి ఒక్కరూ భావించాలి.  

కమ్యూనిస్టులూ.. వ్యతిరేక ఓట్లు చీల్చామనే అపప్రద వద్దు
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నామనే అపప్రద మూటకట్టుకోవద్దని కమ్యూనిస్టులకు చెబుతున్నా. జనసేన నమ్మదగిన పార్టీ కాదు. గత ఎన్నికల్లో ఒక చేత్తో మోదీ, మరో చేత్తో చేగువేరా బొమ్మ పట్టుకొని పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. బట్టతలకు, మోకాలికి లింకు పెట్టినట్టుగా ఉన్నది ఆయన తీరు.  

అప్పటికీ.. ఇప్పటికీ దోపిడీ స్థాయిలోనే తేడా 
1995–2004, 2014–2019.. ఈ రెండుసార్లు చంద్రబాబు తీరు, ఆలోచన, ప్రజా వ్యతిరేక విధానాల్లో ఏమాత్రం తేడా లేదు. కానీ.. దోపిడీ, దుర్మార్గం ఎన్నో రెట్లు పెరిగింది. బీజేపీతో కొంతకాలం, కమ్యూనిస్టులతో కొంతకాలం, మళ్లీ బీజేపీ.. ఇలా సాగింది సంసారం. విలువలను దిగజార్చడంలో చంద్రబాబుకు మరెవరూ సాటి రారు. చెడు నుంచి దుర్మార్గం వరకు చంద్రబాబు ప్రయాణించారు. రాష్ట్ర భవిష్యత్‌ మరింత ప్రమాదకర దిశగా ప్రయాణించకుండా ఉండాలంటే.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. 

రాజధాని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ 
రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తన సొంత రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా తయారు చేశారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రజల నుంచి లాక్కొని.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. హైదరాబాద్‌ అంత లేని సింగపూర్‌ ఆదర్శం అని ఆ దేశాన్ని తీసుకొచ్చారు. సింగపూర్‌లో అవినీతి లేకపోవచ్చు.. ప్రపంచంలోని అవినీతి సొమ్మంతా సింగపూర్‌కు చేరుతోందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సిన మేరకు రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ అలా చేయకుండా, సినిమా చూపించారు. పాత రోజుల్లో బయోస్కోప్‌లో కాశీపట్నం చూపించే వారు. అలా ప్రజలకు సినిమా చూపించి పబ్బం గడుపుకుంటున్నారు.

ప్రజలూ.. ఇవి గుర్తుంచుకోండి 
చంద్రబాబును ఓడించే శక్తి, సామర్థ్యం ఉన్న పార్టీకి, నేతకు ఓటేయండి. జగన్‌కు ఆ సామర్థ్యం ఉందని నేను విశ్వసిస్తున్నాను. జగన్‌కు మించిన ప్రత్యామ్నాయం మరేదీ కనిపించడం లేదు. జనసేన ప్రత్యామ్నాయం కాదు. కాలేదు. పవన్‌తో కలిసినందుకు కమ్యూనిస్టులే తలలు పట్టుకుంటున్నారు.

విశ్వసనీయతకు ఓటేయండి. చేసేదే చెప్పాలనే నిబద్ధత ఉన్న నాయకుడిని ఎన్నుకోండి. అలా చెప్పే ధైర్యం జగన్‌కు మాత్రమే ఉంది. కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయం కోసం ఎండమావుల వెంట పరుగెడుతున్నారు. ఏమాత్రం స్థిరత్వం లేని జనసేనతో జట్టుకట్టారు. చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చామనే అపప్రదను మూటగట్టుకోవద్దని కమ్యూనిస్టు పార్టీలకు సూచన. 

ప్రభుత్వానికి హృదయం ఉండాలి 
ప్రజల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను అర్థం చేసుకునే శక్తి ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం తీసుకొనే చర్యలు అట్టడుగు వర్గాలకూ ఉపయోగపడాలి. ప్రజల కన్నీళ్లను తుడిచే విధంగా పాలన సాగాలి. డాక్టర్‌ వైఎస్సార్‌లోని ‘మానవత్వం’ అంశ జగన్‌లో ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రజలు అధికారం అందిస్తే.. అదే అంశతో పాలన సాగించమని జగన్‌కు సూచిస్తున్నా. 

ఓట్లను ప్రభుత్వ సొమ్ముతో కొంటున్నారు 
రైతులు, మహిళల ఖాతాల్లోకి పోలింగ్‌ ముందు డబ్బులు వేయడం అంటే.. ఓట్లను నేరుగా ప్రభుత్వ డబ్బుతో కొనుగోలు చేయడమే. ప్రజలు అంత అమాయకులేం కాదు. వారు అన్ని విషయాలనూ అర్థం చేసుకోగలరు. వారిని తక్కువ అంచనా వేయడం తప్పు. నాలుగేళ్ల పది నెలలపాటు గాడిదలు కాసి.. ఎన్నికలకు ముందు.. ‘నేను మీ అన్నను. నాకు కోటిమంది చెల్లెళ్లు ఉన్నారు’ అని చంద్రబాబు కబుర్లు చెబుతున్నారు.

ఎప్పుడూ గుర్తుకు రాని చెల్లెళ్లు.. ఎన్నికల ముందు ఎందుకు గుర్తొచ్చారు? ‘కోడలు కొడుకును కంటానంటే.. అత్త వద్దంటుందా’ అనే మాట సీఎం స్థాయి వ్యక్తి అంటారా? ఎన్ని తాయిలాలు ఇచ్చినా చంద్రబాబును నమ్మేవారు ఉంటారని నేను అనుకోవడం లేదు. 

బాబును దించే పార్టీకి అండగా నిలవాలి 
చంద్రబాబు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీకే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే శక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం నావ నీటిలో మునిగిపోతోంది.

ముగినిపోతున్న వాడికి గడ్డి పరక కనిపించినా పట్టుకుంటాడు. అదైనా రక్షిస్తుందనే ఆశ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అంతే. మునిగిపోతున్నాడని అతనికి అర్థమైంది. ఆఖరి ప్రయత్నంగా చేస్తున్నవే.. పెన్షన్లు పెంపు, పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ. చివరి నిమిషంలో చేసే ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయని నేను భావించడం లేదు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు