1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. క్షమాపణలు చెప్పిన పిట్రోడా

10 May, 2019 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ : నాకు హిందీ సరిగా రాదు. దాంతో వాళ్లు నా మాటల్ని వక్రీకరించారు అంటున్నారు కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులతో పాటు.. సిక్కు సంఘాల నాయకులు కూడా శ్యామ్‌ పిట్రోడా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

దాంతో దిగొచ్చిన శ్యామ్‌ పిట్రోడా క్షమాపణలు చెప్పడమే కాక.. ‘నాకు హిందీ సరిగా రాదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ‘జరిగింది చాలా దారుణం’ అని చెప్పాలనుకున్నాను. కానీ భాష సరిగా రాకపోవడంతో బురా(చెడ్డది) అనే పదాన్ని బయటకు అనలేకపోయాను. దాన్ని బీజేపీ వినియోగించుకుంది. నా మాటల్ని పూర్తిగా వక్రీకరించింది. సిక్కుల ఊచకోత దారుణం అని నా అభిప్రాయం. కానీ దాన్ని సరిగా వ్యక్తపర్చలేకపోయాను. ఇందుకు నన్ను క్షమించండి’ అన్నారు శ్యామ్‌ పిట్రోడా.

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్‌ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్‌ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్‌ చేసింది.

ఈ విషయంపై స్పందించిన శ్యామ్‌ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్‌ గాంధీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ప్రారంభమయ్యింది.

మరిన్ని వార్తలు