పాక్‌పై ఐఏఎఫ్‌ దాడి తప్పు

23 Mar, 2019 03:35 IST|Sakshi
శామ్‌ పిట్రోడా

కాంగ్రెస్‌ ఓవర్సీస్‌ విభాగం అధ్యక్షుడు శామ్‌ పిట్రోడా వ్యాఖ్య

బాలాకోట్‌ దాడిపై మరిన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాక్‌పై ఐఏఎఫ్‌ జరిపిన దాడులను కాంగ్రెస్‌ ఓవర్సీస్‌ విభాగం అధ్యక్షుడు శామ్‌ పిట్రోడా తప్పుపట్టారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను ముఖ్యంగా మృతుల సంఖ్యను వెల్లడించాలని పిట్రోడా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘వాళ్లు(ఐఏఎఫ్‌) 300 మంది ఉగ్రవాదులను చంపడం సరే. దీనిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపగలరా?. సరిహద్దు అవతలి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దాడులు చేశారు.

ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోనూ దాడి జరిగింది. దీనిపై స్పందించిన అప్పటి యూపీఏ వెంటనే సరిహద్దుల్లోకి విమానాలను పంపించలేదు. కానీ, ఒక సంఘటన ఆధారంగా ఇలా చేయడం దాడి చేయడం సరైన విధానం కాదు’ అన్నారు. ‘కొందరు ఉగ్రవాదులు జరిపిన దాడికి పాక్‌ను శిక్షించడం సరికాదు. 8మంది ఉగ్రవాదులు వచ్చి ముంబైలో దాడి చేశారు. అంతమాత్రాన పాక్‌పై విరుచుకుపడతారా? కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశ ప్రజలందరినీ తప్పుపడతారా?  

ప్రధాని తీరు నిరాశ కలిగించింది
‘నేను కొన్ని వివరాలు మాత్రమే అడిగా. అదీ వ్యక్తిగతంగానే, ఇందులో కాంగ్రెస్‌ ప్రమేయమేమీ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది. దానిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. అదీకూడా ప్రధానిస్థాయి వ్యక్తి. ఆయన సమాధానంతో నిరాశ చెందా’ అన్నారు. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పుల్వామా ఘటన చేసుకుంది. బాలాకోట్‌పై ఐఏఎఫ్‌ జరిపిన దాడి మన బలగాల సాహసానికి ప్రతీక. ప్రధాని మోదీ, బీజేపీ తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుకోవడం ఆపాలి. సైనిక బలగాల త్యాగాలను స్వార్థానికి వాడుకోవడం మానాలి’  అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

ప్రజలు క్షమించబోరు: మోదీ
శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఆయన తన మాటలతో పాక్‌ జాతీయ దినోత్సవాలకు అంకురార్పణ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను క్షమించే సహజ స్థావరాలుగా మారాయంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో ప్రజలు క్షమించరు(జన్‌తా మాఫ్‌ నహీ కరేగీ)అనే హ్యాష్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘కాంగ్రెస్‌ రాచ కుటుంబానికి విశ్వాసపాత్రుడొకరు ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాన్ని మరోసారి అంగీకరించారు. ఉగ్ర మూకల చర్యలకు దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఉగ్రవాద చర్యలకు వారికి అర్థమయ్యే భాషలో బదులిచ్చాం. మన బలగాల త్యాగాలను అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాల చేష్టలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరు, మర్చిపోరు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు