మోదీ ఫోన్‌ చేసుంటే మాట్లాడుకునేవాళ్లం

27 Mar, 2019 15:19 IST|Sakshi
శ్యామ్‌ పిట్రోడా (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ: మోదీతో నాకు మంచి పరిచయం ఉంది. బాలాకోట్‌ దాడులను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలపై ఆయనకు అభ్యంతరాలుంటే నాకు ఫోన్‌ చేసుంటే సరిపోయేద’ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సలహాదారు శ్యామ్‌ పిట్రోడా అన్నారు. బాలాకోట్‌లో వాయుసేన జరిపిన దాడులపై ఇటీవల పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి.

ఈ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘నేను చెప్పిన మాటల్ని వక్రీకరించారు. నేనొకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు అడిగేవాడ్ని. నేను గాంధీ తత్వాన్ని పాటించే గుజరాతీ కుటుంబంలో పుట్టాను. హింసను విడనాడి.. సత్యం, ప్రేమకు దగ్గరగా ఉండాలని నమ్మే సిద్ధాంతం మాది. ఒకరి మీద ఇంకొకరు బాహ్య దాడి చేయడాన్ని సమర్థించను. దాని బదులు మన అంతరంగాన్ని బలపరుచుకోవడమే మేలని నమ్ముతాను. నేను స్వతహాగా హింసను వ్యతిరేకిస్తాను. ముంబై ఉగ్రఘాతుకం తర్వాత ముష్కరులపై అప్పటి మన్మోహన్‌ ప్రభుత్వం ప్రతిదాడులకు దిగకపోవడాన్నీ సమర్థిస్తా.. అలాగే ఇప్పటి పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌లో మన వాయుసేన జరిపిన దాడులకూ మద్దతిస్తాను. ఈ రెండు సంఘటనలు ఆయా ప్రభుత్వాల నిర్ణయమని నేనన్నాను. ఒకసారి సర్కార్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. హింసతో దేన్నీ సాధించలేము. ఇవి నేను పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో మోదీ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. వీటిపై అభ్యంతరాలుంటే మోదీ నన్ను సంప్రదించి ఉండాల్సింద’ని పిట్రోడా వివరించారు.  

>
మరిన్ని వార్తలు