‘ఖురాన్‌లో ఏముంటే దానికే మా పార్టీ మద్ధతిస్తుంది’

21 Jun, 2019 16:34 IST|Sakshi
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌

ఎస్పీ నేత ఆజం ఖాన్‌

న్యూఢిల్లీ: ముస్లింల పవిత్ర గ్రంధం ‘ఖురాన్‌’లో ఏం రాసి ఉందో దానికే మా పార్టీ మద్ధతిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం శుక్రవారం త్రిపుల్‌ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో ఈ విషయంపై ఆజంఖాన్‌ ఢిల్లీలో స్పందించారు. ‘ 1500 సంవత్సరాల క్రితమే ఏ మతంలో లేని విధంగా ఇస్లాంలో మహిళలకు సమాన హక్కులు ఇచ్చారు. మహిళలకు సమానత్వం కల్పించిన మతాల్లో ఇస్లాం మతమే మొట్టమొదటిది.  ఒక్క ఇస్లాం మతంలోనే మహిళలపై దాడులు, విడాకులు తక్కువగా ఉన్నాయి. మహిళలపై పెట్రోలు పోసి తగలపెట్టడం, చంపడం లాంటివి ఇస్లాంలో లేవ’ని ఆజం ఖాన్‌ పేర్కొన్నారు.

‘ త్రిపుల్‌ తలాక్‌ అనేది మతానికి సంబంధించిన విషయం. ఇది ఎంతమాత్రం రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఇస్లాంలో ఖురాన్‌ కంటే ఏదీ సుప్రీం నిర్ణయం కాదు. పెళ్లి, విడాకులు, ఇతరత్రా అన్ని విషయాల గురించి ఖురాన్‌లో స్పష్టంగా సూచనలు ఉన్నాయ’ని ఆజం ఖాన్‌ చెప్పారు. గత సంవత్సరం ముస్లిం(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌) మహిళ బిల్లు-2018 లోక్‌సభలో పాసైనప్పటికీ రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వం రద్దు కావడంతో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ముస్లిం మహిళ బిల్లు-2019ను తీసుకువచ్చింది.
 

మరిన్ని వార్తలు