దీక్షకు అర్థం మార్చిన బాబు

21 Apr, 2018 08:41 IST|Sakshi

అందర్నీ ఢిల్లీ వెళ్లమని..మీరు విజయవాడలో దీక్ష చేస్తారా

గాంధీ, పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుంది

ఏసీలు, బిర్యానీలు, శీతలపానీయాలతో దీక్షలా

సామినేని ఉదయభాను ఆగ్రహం

జగ్గయ్యపేట అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మదీక్ష పేరుతో దీక్షల అర్థం మార్చివేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మండిపడ్డారు. బాబు దీక్షను చూసి జాతిపిత మహాత్మాగాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీక్షలనేవి నిరాడంబరంగా జరగాలన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మదీక్షకు ఏసీలు, చలువ పందిళ్లు, బిర్యానీ పాకెట్లు, శీతలపానీయాల వంటి వాటితో హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలను బలవంతంగా తరలిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను, ప్రభుత్వ ఉద్యోగులను దీక్షకు తరలించాలని జీవోలు జారీ చేసే పరిస్థితి నెలకొందంటే బాబుపై ప్రజల్లో ఏపాటి నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. దీక్షలు, ధర్నాల వలన ఏమొస్తుందన్న చంద్రబాబు నేడు దీక్ష ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో దీక్ష చేస్తే అరెస్ట్‌ చేస్తారని భయం
ఢిల్లీలో దీక్ష చేస్తే క్షణాల్లో ఆయన్ను అరెస్ట్‌ చేస్తారనే భయం ఉండబట్టే ఆయన విజయవాడ కేంద్రంగా దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఒక్కోమంత్రి ఒక్కో జిల్లాలో దీక్షకు కూర్చోవటం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బసులన్నీ ఆయన దీక్షకు జనాలను తీసుకువెళ్లటానికి కేటాయించటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

బాబుకు జగన్‌కు పోలిక లేదు
సీఎం చంద్రబాబు కుటుంబం కార్పొరేట్‌ హంగులకు అలవాటు పడిందన్నారు. కానీ తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండలను సైతం లెక్క చేయకుండా నడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు తన కుమారుడుని పరోక్షంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దొడ్డిదారిన మంత్రిని చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించి ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చారన్నారు.

టీడీపీ నేతల చూపు వైఎస్సార్‌ సీపీ వైపు..
తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు వైఎస్సార్‌ సీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం  చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే టీడీపీకి చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు జగన్‌ సమక్షంలో తమ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు