రేవంత్‌కు నో ఎంట్రీ.. సంపత్‌ కౌంటర్‌!

20 Sep, 2019 15:48 IST|Sakshi

యురేనియం అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌కి ఆహ్వానం లేదు

సర్పంచ్‌ కూడా లేని పార్టీ జనసేన

నాకు సెల్ఫీ పిచ్చిలేదు : మాజీ ఎమ్మెల్యే సంపత్‌

సాక్షి, హైదరాబాద్‌: యురేనియం విషయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు రావని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను చదువులో పీహెచ్‌డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని సంపత్‌ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. తాను గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, అందుకే మీడియాకు అందుబాటులో లేకపోయానని వివరించారు. రేవంత్ రెడ్డి నాకు అత్యంత ముద్దుల అన్నయ్య అని, కానీ తనపైన ఎందుకు అలా మాట్లాడారో అర్థంకావట్లేదని అన్నారు. యురేనియం విషయంలో రేవంత్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు.. పూర్తి సమాచారం తెలుసుకున్న అనంతరం మాట్లాడుతానని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వంశీచందర్‌, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్‌కు మాత్రం లేదని తెలిపారు.

రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశంలో సంపత్‌ మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ నాకు సెల్ఫీ ఇవ్వలేదని నేను రేవంత్పైన పడ్డట్టు ఆయన మాట్లాడుతున్నారు. నాతో సెల్ఫీ దిగడానికి చాలా మంది వస్తారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. కేవలం జనసేన బ్యానర్ పైన అఖిలపక్షం భేటీ జరగడం సరికాదు. కనీసం సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీ జనసేన. యురేనియం ఉద్యమ క్రెడిట్ వేరే పార్టీకి ఇవ్వొద్దు. రేపు పవన్ కల్యాణ్ యురేనియం పైన మళ్ళీ మీటింగ్ పెడితే వెళ్తా.. కానీ కాంగ్రెస్‌ పార్టీ పాత్ర  ఏంటీ అనేది ముందే పార్టీలో చర్చ జరగాలి. యురేనియం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అంతా జనసేన పార్టీకి క్రెడిట్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా ప్రశ్నిస్తా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెజాన్ అడవులలో మాట్లాడినా నేను సంతోషిస్తా. నేను పీసీసీ పదవికోసం ఎవరినీ అడగలేదు. ఎస్సీ సామాజికవర్గానికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తే నేను రెడీ. దామోదర రాజనర్సింహ పేరు ను పీసీసీ చీఫ్ పదవికి పరిశీలించాలని కోరతాను’ అని సంపత్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం

మరిన్ని వార్తలు