మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత

14 Jul, 2020 16:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: గజపతి వంశస్థుల హక్కులు కాపాడాలంటూ కొత్త రాగం ఎత్తుకున్న టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తన చిన్నాన్న అశోక్‌ గజపతిరాజు వలె చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలిని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి.. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వంపై బురదజల్లాలని చూసిన ఆయనకు ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

ఈ మేరకు.. ‘‘నేను సంచయిత గజపతి. మా తాత మహరాజా పీవీజీ రాజు పెద్ద కుమారుడు, చట్టబద్ధమైన వారుసుడైన నా తండ్రి ఆనంద గజపతికి చట్టబద్దమైన వారసురాలిని. అశోక్‌ గజపతిలాగా చంద్రబాబు గారు కూడా లింగ వివక్ష చూపించరని ఆకాంక్షిస్తున్నా. గజపతి వంశానికి తానొక్కడినే వారసుడినని, నేను అనే వ్యక్తిని లేను అన్నట్లుగా అశోక్‌ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించారనుకుంటున్నా. గజపతి కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేయాలని చూడవద్దు’’ అని సంచయిత ట్వీట్‌ చేశారు. సింహాచలం, మన్సాస్‌ బోర్డు చైర్‌ పర్సన్‌గా తన నియామకం జరిగినందున గజపతి కుటుంబ హక్కులకు ఎటువంటి భంగం కలుగలేదని స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత)

కాగా 2016 ఏప్రిల్‌లో మన్సాస్‌ వ్యవహారం ఆనాటి టీడీపీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్‌ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్‌ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. 

ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం... ఈ ఏడాది మార్చిలో ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్‌ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్‌ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. ఈ నేపథ్యంలో అశోక్‌ గజపతిరాజు సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉండే హక్కు మహిళలకు లేదన్నట్లుగా మాట్లాడటంతో పాటు సంచయిత నియామకంపై విమర్శలు గుప్పించడం గమనార్హం. ప్రస్తుతం చంద్రబాబు సైతం ఇదే రాగాన్ని ఆలపిస్తున్నారు. సింహాచలం ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌గా గజపతి వారసురాలు ఉన్నప్పటికీ.. వారి కుటుంబ హక్కులకు భంగం వాటిల్లిందంటూ బాబు ట్వీట్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు