బాబు, బాబాయ్‌పై సంచయిత విమర్శలు

3 Jun, 2020 20:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మాన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా తన నియామకంపై వస్తున్న విమర్శలను సంచయిత గజపతిరాజు తిప్పికొట్టారు. ‘ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్‌ అశోక్‌ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేశారు’అని మాజీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘అశోక్‌ గజపతిరాజుగారి పదవీకాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్‌ ఆర్థికంగా నష్టపోయింది. విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింది. ట్రస్టు భూములు పరులపాలవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ను నియమించలేదు. విశాఖ అడిషనల్‌ జిల్లా జడ్జి తీర్పే ఉదాహరణ’అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత)

మీ ఇద్దరూ కలిసి చేసినవే..!
‘మాన్సాస్‌ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఉచితంగా ఇచ్చేశారు. విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారు. చివరకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. చంద్రబాబుగారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే.. ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారు’అని సంచయిత విమర్శించారు.

మరిన్ని వార్తలు