అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: సండ్ర

3 Mar, 2019 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి అధికార టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును సండ్ర కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాను పార్టీ మారుతున్నది వాస్తవేమనని ఆదివారం మీడియాకు వెల్లడించారు.

‘ప్రజల యొక్క మనోభావాలు, సత్తుపల్లి ప్రజల అవసరాల కోసం.. ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీడీపీకి రాజీనామా చేసి.. మరికొద్దిరోజుల్లోనే టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటన్నా. కేసులకు భయపడేవాడినైతే అప్పుడే పార్టీ మారేవాడిని. అయినా అవీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం చేతులో ఏం లేదు. మూడు సార్లు గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతున్నాను. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడూ చేరేది మాత్రం కార్యకర్తలతో చర్చించిన తరువాతే ప్రకటిస్తాను’ అని ఆయన తెలిపారు.

శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది.  శాసనసభ్యుల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ సైతం ఒక స్థానానికి పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలబలాల ప్రకారం టీడీపీ మద్దతుతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు దగ్గరగా ఉంటున్న సండ్ర వెంకటవీరయ్యతో ఈ పని ప్రారంభించింది. పోలింగ్‌లోగా మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) మద్దతు పొందేలా వ్యూహాలను అమలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు