గులాబీ గూటికి సండ్ర!

3 Mar, 2019 01:03 IST|Sakshi
శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సండ్ర వెంకటవీరయ్య 

టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు 

అదే దారిలో మరో ఎమ్మెల్యే మెచ్చా 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కానుంది. టీటీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్‌‡్షకు పదునుపెట్టింది. ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ఈ సందర్భంగా సండ్ర... కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 12న జరగనుంది. ఆలోగా సండ్ర అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ సైతం ఒక స్థానానికి పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీ మద్దతుతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు దగ్గరగా ఉంటున్న సండ్ర వెంకటవీరయ్యతో ఈ పని ప్రారంభించింది. పోలింగ్‌లోగా మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) మద్దతు పొందేలా వ్యూహాలను అమలు చేస్తోంది. 

ఉమ్మడి ఖమ్మంపై నజర్‌... 
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించి కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా భారీ తీర్పు వచ్చింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (ఒక సీటులో మిత్రపక్షమైన ఎంఐఎం పోటీ చేయనుంది) గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌... ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. మరో ఎమ్మెల్యే నాగేశ్వర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారు. సండ్ర 1994లో సీపీఎం తరఫున పాలేరులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచారు. 

ఖమ్మం జిల్లాకు సాగర్‌ ఎడమ కాల్వ నీరు 
ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పం టను కాపాడేందుకు నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయా లని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌. కె. జోషిని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలసిన సండ్ర... సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రైతులు దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, 10 రోజులపాటు సాగర్‌ ఎడమ కాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు