ఫలించిన హరీష్‌ వ్యూహాలు.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

25 Jan, 2020 12:39 IST|Sakshi

 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కారు జోరు

సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎ‍న్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇ‍ప్పటికే మధిర, కొత్తగూడెం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కారు పార్టీ.. తాజాగా వెలువడిన ఫలితాల్లో మరిన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. రెండు మున్సిపాలిటిల్లోనూ జగ్గారెడ్డికి ఓట్లర్లు దిమ్మతిరిగే రీతిలో షాక్‌ ఇచ్చారు. అలాగే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయ దుందుబీ మోగించింది. మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నారాయన్‌ఖేడ్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. ఫలితాలపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

హరీష్‌ చాణక్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌కు కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డిలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. అయినా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగింది. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్‌ మంత్రి హరీష్‌ రావుకు సంగారెడ్డి, సదాశివపేట బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీష్‌ మొదటి నుంచీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనికి తగట్టుగానే హస్తం అభ్యర్థులను మట్టికరిపిస్తూ సంగారెడ్డిపై గులాబీ జెండా ఎగరేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా