సీఎం పీఠమూ 50:50నే!

1 Nov, 2019 04:27 IST|Sakshi
గవర్నర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఆదిత్య ఠాక్రే, శివసేన నేతలు

తేల్చిచెప్పిన శివసేన; పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే

గవర్నర్‌ను కలిసిన ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

ముంబై: ‘మహా’ సస్పెన్స్‌ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్‌ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. సమ అధికార పంపిణీ అంటే.. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవడమేనని తేల్చిచెప్పింది. దాంతో, డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు తెరపడింది.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా,  మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిత్య ఠాక్రేనే షిండే పేరును ప్రతిపాదించారు. ఉద్ధవ్‌ సూచన మేరకే ఎల్పీ నేతగా షిండే తెరపైకి వచ్చారని సమాచారం.

పలువురు పార్టీ నేతలతో కలిసి ఉద్ధవ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌ కోషియారీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయని, అందువల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన కరువు నెలకొన్నట్లుగా ప్రకటించాలని గవర్నర్‌ను కోరారు.  కాగా, శివసేన కార్యాలయం ముందు ‘ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.

వాడుకుని వదిలేసే విధానం వద్దు
బీజేపీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. అధికార పంపిణీ విషయంలో సేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్‌ ఠాక్రేదేనని స్పష్టం చేశారు.  

ఢిల్లీ ముందు తలొంచం
ఎన్సీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని ఆ హోర్డింగ్‌పై రాసి ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనపై కేసు పెట్టినప్పుడు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ చేసిన వ్యాఖ్య అది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి.

పవార్‌తో సంజయ్‌ రౌత్‌ భేటీ
బీజేపీ, శివసేనల మధ్య విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో.. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది.  సేన, బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సంజయ్‌ రౌత్‌ ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా