‘మహా’ రగడ: అమిత్‌ షా అసత్యాలు

14 Nov, 2019 14:17 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య జరిగిన ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అసత్యాలు చెబుతున్నారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్‌ పట్ల అమిత్‌ షా అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రొటేషనల్‌ సీఎం అంశంపై అమిత్‌ షా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకుండా దాగుడుమూతలు ఆడారని మండిపడ్డారు.

మహారాష్ట్రలో ఎన్నకల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని చెప్పడం ప్రస్తావిస్తూ.. జనబాహుళ్యంలో మోదీకి ఉన్న పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ఆయన ప్రకటనలను ఆ సమయంలో తాము ఆక్షేపించలేదని స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివసైనికుడేనని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సైతం పలు సభల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. రొటేషనల్‌ సీఎం ప్రతిపాదన తమ ఒప్పందంలో లేదని అమిత్‌ షా ఇప్పుడెలా చెబుతారని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఇరు పార్టీల మధ్య సజావుగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా ఎందుకు దిగజారాయని నిలదీశారు. కాగా, శివసేనతో ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో సీఎం పదవిని చెరు రెండున్నరేళ్లు పంచుకునే అంశం లేదన అమిత్‌ షా పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు